పారిపోవ‌డం, కాళ్లు ప‌ట్టుకోవ‌డం.. ఇదేగా నీ బ‌తుకు.. బాల‌శౌరి జాత‌కం బ‌య‌ట‌పెట్టిన పేర్ని

నీ జాత‌కం మొత్తం ప్ర‌పంచానికి తెలుసని ఎద్దేవా చేశారు. రాజ‌కీయ జీవితంలో నీ కుప్పిగంతులు, క‌ప్ప‌దాటుళ్లు, అందక‌పోతే కాళ్లు ప‌ట్టుకునే నీ త‌త్వం అంద‌రికీ తెలుసని మండిపడ్డారు.

Advertisement
Update:2024-02-06 15:09 IST

వైసీపీకి రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేరి.. 2019 నుంచి 2024 వరకు వైసీపీలో జరిగినవన్నీ తనకు తెలుసని, రానున్న రోజుల్లో అన్నీ వివరిస్తానని చెప్పిన మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురించి, వైసీపీ గురించి నువ్వు బ‌య‌ట‌పెట్ట‌డం కాదు.. నీ జాత‌కం మొత్తం ప్ర‌పంచానికి తెలుసని ఎద్దేవా చేశారు. రాజ‌కీయ జీవితంలో నీ కుప్పిగంతులు, క‌ప్ప‌దాటుళ్లు, అందక‌పోతే కాళ్లు ప‌ట్టుకునే నీ త‌త్వం అంద‌రికీ తెలుసని మండిపడ్డారు.

ప్ర‌తి ఎల‌క్ష‌న్‌కూ కొత్త నియోజ‌క‌వ‌ర్గానికి పారిపోయావ్‌

2004లో కాంగ్రెస్ త‌ర‌ఫున తెనాలి ఎంపీగా గెలిచి, త‌ర్వాత 2009 నాటికి న‌ర‌స‌రావుపేట పారిపోయిన బాల‌శౌరి అక్క‌డా ఓడిపోయార‌ని పేర్ని గుర్తు చేశారు. 2014లో గుంటూరుకు మకాం మార్చి అక్క‌డా ఓడిపోయాడ‌న్నారు. చివరికి గ‌తి లేక కాపుల ఓట్లు ఎక్కువ ఉన్న మ‌చిలీప‌ట్నానికి వ‌చ్చి 2019లో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గాల్లో మ‌ళ్లీ ఎంపీ అయ్యావ‌ని గుర్తు చేశారు. ఒక‌సారి వైఎస్ గాలిలో, మ‌రోసారి జ‌గ‌న్ గాలిలో గెలిచిన నువ్వా జ‌గ‌న్ గురించి మాట్లాడేద‌ని మండిప‌డ్డారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వద్దంటే చిరంజీవి కాళ్లు ప‌ట్టుకున్నావ్‌

జ‌న‌సేన‌లో చేర్చుకోవ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌సేమిరా అంటే, ఎన్నిసార్లు అడిగినా ఛీకొట్టిన సంగ‌తి మ‌రిచిపోయావా అని పేర్ని నాని బాల‌శౌరిని ప్ర‌శ్నించారు. జ‌న‌సేన‌లో చేర్పించ‌మ‌ని చిరంజీవి కాళ్లు ప‌ట్టుకుని, ఆయ‌న రిక‌మండేష‌న్‌తో నాదెండ్ల మ‌నోహ‌ర్ ద్వారా జ‌న‌సేన‌లో చేరావ‌న్న సంగ‌తి మ‌ర్చిపోయి పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నావ‌ని దుయ్య‌బ‌ట్టారు. అంత‌కుముందు మ‌నోహ‌ర్‌ను ఎన్నో మాట‌ల‌న్న సంగతి మ‌ర్చిపోయి ఇప్పుడు ఆయ‌న ద‌య‌తోనే జ‌నసేన‌లోకి వెళ్లావ్‌.. నువ్వా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని విమ‌ర్శించేదని బాల‌శౌరిపై విరుచుకుప‌డ్డారు పేర్ని నాని.

Tags:    
Advertisement

Similar News