నారాయణ యాక్టివయ్యారా?

లోకేష్ పాదయాత్రలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డితో భేటీ అవటం, యువ‌గ‌ళం యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో చాలా బిజీ అయిపోయారు.

Advertisement
Update:2023-06-30 10:42 IST

మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఇంతకాలం టీడీపీలో ఉన్నారో లేదో అన్నట్లుగా లో ప్రొఫైల్ మైన్ టైన్ చేసిన పొంగూరు సడెన్‌గా లోకేష్ పాదయాత్రతో యాక్టివ్ అయ్యారు. విద్యా వ్యాపారవేత్తగా పాపులర్ అయిన ఈ మాజీ మంత్రి 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటానికి చాలా సాయం చేశారు. ఉత్తరాంధ్రలోని అభ్యర్థులకు ఆర్థికంగా అండదండలు అందిచారనే ప్రచారం అందరికీ తెలిసిందే. దానికి బహుమానంగానే అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు తన క్యాబినెట్లోకి తీసుకున్నారు.

అప్పటి నుండి ఐదేళ్ళపాటు క్యాబినెట్లో నెంబర్ 2 గా చక్రం తిప్పారు. రాజధాని భూముల సమీకరణ లాంటి కీలక బాధ్యతలను కూడా నిర్వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన‌ సమస్త కసరత్తులో నారాయణే కీలకంగా వ్యవహరించారు. నిజానికి నారాయణ రాజకీయ నేతేమీ కాదు. కేవలం వ్యాపారవేత్త మాత్రమే. అందుకనే టీడీపీ అధికారంలోకి రాగానే నారాయణను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

2019లో వైసీపీ అధికారంలోకి రాగానే నారాయణ తెరమరుగైపోయారు. విద్యాసంస్థ‌ల్లో అవకతవకలు, 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులు, అమరావతి భూకుంభకోణం కేసులు నమోదయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆకాశమేహద్దుగా రెచ్చిపోతే ఏమవుతుందో నారాయణకు అవగాహన ఉండుంటుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే మాజీ మంత్రి రాజకీయంగా తెరవెనుకకు వెళ్ళిపోయారు. అయినా కేసులు మీద పడి విచారణ ఎదుర్కొంటూ, అరెస్టయి బెయిల్ మీద బయటున్నారు. అలాంటి నారాయణ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు సిటి నియోజకవర్గం నుండి నారాయణే పోటీ చేయబోతున్నట్లు ఈ మధ్యనే చంద్రబాబు ప్రకటించారు.

అంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అనీల్ కుమార్-నారాయణే ప్రత్యర్థులుగా నిలవబోతున్నారు. అందుకనే లోకేష్ పాదయాత్రలో మాజీమంత్రి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డితో భేటీ అవటం, లోకేష్ పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో చాలా బిజీ అయిపోయారు. రాబోయే కాలమంతా మళ్ళీ బిజీగానే ఉండబోతున్నారని అర్థ‌మవుతోంది. సిటీ నియోజకవర్గంలోని తమ్ముళ్ళతో సమావేశాలు పెట్టుకుంటున్నారు. డివిజన్లవారీగా పార్టీ పటిష్టానికి భేటీలు జరుపుతున్నారు. కోటంరెడ్డితో కలిసి జాయింట్ మీటింగులు కూడా పెట్టుకుంటున్నారు. మొత్తానికి ఇంతకాలానికి నారాయణ యాక్టివ్ అయ్యారు.

Tags:    
Advertisement

Similar News