స్కిల్ డెవలప్‌మెట్ స్కాంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు, ఆయన కుమారుడు అరెస్టు

శనివారం తెల్లవారుజామున విశాఖపట్నంలోని గంటా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలోని పోలీసు బృందం ఆయనను అదుపులోకి తీసుకున్నది.

Advertisement
Update:2023-09-09 08:55 IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో సీఐడీ పోలీసులు అరెస్టులు ముమ్మరం చేశారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు హయాంలో మానవ వనరుల శాఖ మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాసరావును కూడా అరెస్టు చేశారు. శనివారం తెల్లవారుజామున విశాఖపట్నంలోని గంటా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలోని పోలీసు బృందం ఆయనను అదుపులోకి తీసుకున్నది. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమారుడిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది.

అసలు ఏంటీ స్కిల్ డెవపల్‌మెంట్ స్కాం?

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ జర్మనీకి చెందిన సీమెన్స్, ఇండియాకు చెందిన డిజైన్‌టెక్ సంస్థలు రూ.3,300 కోట్లకు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10 శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన రూ.370 కోట్లను జీఎస్టీతో కలిపి చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది.

అయితే ప్రభుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్లు సీమెన్స్ పేరుతో కాకుండా డిజైన్ టెక్ సంస్థకు బదిలీ చేశారు. ఈ ఆరోపణల పైనే సీఐడీ కేసు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారి పట్టించి, ఒప్పందంలో మార్పులు చేసి డబ్బులు కాజేశారని సీఐడీ అభియోగాలు మోపింది. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి తీసుకొని వెళ్లగా.. వాళ్లు కూడా దర్యాప్తు చేస్తున్నారు.

రూ.240 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఏపీ సీఐడీ గుర్తించింది. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ-గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర సంస్థలకు ఈ డబ్బును బదిలీ చేశారు. అప్పట్లో సీమెన్స్ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ కన్వీకర్ ద్వారా మొత్తం కుంభకోణం నడిపించినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. సీమెన్స్ కంపెనీతో రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎంవోయూ చేసుకున్న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. జీవోలో మాత్రం ఆ ప్రస్తావనను తొలగించింది. 2016-18 మధ్య ఈ కుంభకోణం జరిగింది.

కాగా, అధికారులను మేనేజ్ చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ అధికారుల దర్యాప్తులో అసలు కుట్ర బయటపడింది. ఈ స్కామ్‌పై ఆదాయపు పన్ను శాఖ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో సీఐడీ అధికారులు అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ విచారణ జరిపి కుంభకోణాన్ని వెలికి తీసింది.

Tags:    
Advertisement

Similar News