బలుపుతోనే ఓడిపోయాం- దేవినేని ఉమా
వైసీపీ వాళ్లు ప్రతి నియోజకవర్గంలో రూ. 50 కోట్ల వరకు రెండు వేల రూపాయల నోట్ల రూపంలో డంప్ చేశారని, ఇప్పుడు ఆ డబ్బునంతా లిక్కర్ షాపుల ద్వారా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో తమ బలుపు, అహంకారం కారణంగానే ఓడిపోయామని అంగీకరించారు. పసుపు- కుంకుమ ఇచ్చాం.. జనం వీర తిలకాలు దిద్దుతున్నారు.. ఊరేగిస్తున్నారని ఊరేగాం అందుకే ఓడిపోయామన్నారు. వైసీపీ వాళ్లు మాత్రం ఏం చేయాలో అదే చేశారన్నారు. జనం వద్దకు వెళ్లి చేతులు, గడ్డాలు పట్టుకుని ఒక్క చాన్స్ అంటూ అడుక్కున్నారన్నారు.
మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యేలపై దేవినేని ఉమా విమర్శలు చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కొండలు, గుట్టలను మింగేస్తున్నారని, నెలకు రూ. 7 కోట్లు పైకి (పెద్దలకు) పంపిస్తున్నారని ఆరోపించారు. వీరంతా వసూల్ బ్రదర్స్ అని ఊగిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఏమైనా నీతివంతులా?, పుడింగులా? అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
వైసీపీ వాళ్లు ప్రతి నియోజకవర్గంలో రూ. 50 కోట్ల వరకు రెండు వేల రూపాయల నోట్ల రూపంలో డంప్ చేశారని, ఇప్పుడు ఆ డబ్బునంతా లిక్కర్ షాపుల ద్వారా మార్చుకుంటున్నారని ఆరోపించారు. ఇంత ఆదాయం ఉండబట్టే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదన్నారు.