చంద్రబాబు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి

పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్ణయాలన్నీ తప్పని అంబటి చెప్పారు. అయినా చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదే పనిగా గోబెల్స్‌ ప్రచారం చేశారని ఆయన తెలిపారు.

Advertisement
Update:2024-08-18 08:48 IST

పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి, తప్పులు జరగటానికి కారణం చంద్రబాబేనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ వెల్లడించిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను ఒప్పుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈనెల 12న నిపుణుల కమిటీ కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) ఇచ్చిన నివేదికలో.. బాబు హయాంలో ఏకకాలంలో కాఫర్‌ డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించారని, ఇది పెద్ద తప్పిదమని పేర్కొందని అంబటి వివరించారు. డయా ఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నా, దానిపైనే కాఫర్‌ డ్యామ్‌ నిర్మించారని, దీంతో ఇప్పుడు సీపేజ్‌ (ఊట నీరు) వస్తోందని, జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్నా పట్టించుకోలేదని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపిన విషయాన్ని గుర్తుచేశారు.

చంద్రబాబు తప్పిదం, అవినీతి, అవగాహన రాహిత్యం వల్లే డయా ఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయిందని అంబటి స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌ అప్పటి కేంద్ర మంత్రితో మాట్లాడి.. అంతర్జాతీయ ఎక్స్‌పర్ట్స్‌ ప్యానల్‌ను తయారు చేశారని అంబటి చెప్పారు. అందులో ఇద్దరు కెనడా, ఇద్దరు అమెరికాకు చెందిన నిపుణులు ఉన్నారని ఆయన తెలిపారు. ఆ నిపుణుల కమిటీనే ఇప్పుడు నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్ణయాలన్నీ తప్పని అంబటి చెప్పారు. అయినా చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదే పనిగా గోబెల్స్‌ ప్రచారం చేశారని ఆయన తెలిపారు. జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లాలని చూశారని మండిపడ్డారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు పనులన్నీ గాడిలో పడ్డాయని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News