55 రోజుల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు
ఓ పక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫుల్‌స్టాప్ లేకుండా అమలు చేస్తూ.. మరోపక్క తన అనుకూల మీడియాతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం 55 రోజుల్లోనే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు.
రాష్ట్రంలో వైసీపీ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫుల్‌స్టాప్ లేకుండా అమలు చేస్తూ.. మరోపక్క తన అనుకూల మీడియాతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల వేళ నుంచే చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అసత్యాలు వల్లెవేస్తూనే ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రూ.7800 కోట్ల నిధులు నిల్వ ఉన్నాయని సీతారాం చెప్పారు. కానీ, ఆయన తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు లెక్కలు చెబుతూ అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని సీతారాం మండిపడ్డారు.