16న వైసీపీ ఫైనల్ లిస్ట్.. ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్
ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో జగన్ చాలా మార్పులు చేశారు. సామాజిక సమీకరణాలు, నాయకుడి పనితీరు, అతని బలాబలాలు, ప్రజల్లో అభ్యర్థిపై ఉన్న అభిప్రాయం వంటి వాటిపై సర్వేలు చేయించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.
రానున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు మిగిలిన స్థానాలన్నింటికీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసేసింది. ఈ నెల 16న తుది జాబితా ప్రకటించబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఇప్పటికే 12 జాబితాల్లో దాదాపు 70 స్థానాలకుపైగా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన అన్ని స్థానాలకు రెండు రోజుల్లోనే జాబితా విడుదల కానుండటంలో ఆశావహులు టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు.
ఎన్నో మార్పులు..
ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో జగన్ చాలా మార్పులు చేశారు. సామాజిక సమీకరణాలు, నాయకుడి పనితీరు, అతని బలాబలాలు, ప్రజల్లో అభ్యర్థిపై ఉన్న అభిప్రాయం వంటి వాటిపై సర్వేలు చేయించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లిస్తారు. చాలామంది స్థానాలు మార్చారు. ఉదాహరణకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన బొత్స ఝాన్సీరాణిని విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. చాలా జిల్లాల్లో సిట్టింగ్‌లను పక్కనపెట్టారు.
అసమ్మతి స్వరాలను నియంత్రించాలి
రాజోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను అమలాపురం ఎంపీకి పంపించారు. ఆయన స్థానంలో టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు టికెటిచ్చారు. దీంతో రాపాక అసమ్మతిస్వరం వినిపిస్తున్నారు. ఇలా మంత్రులు రోజా, విడదల రజిని, కొట్టు సత్యనారాయణ తదితరులకు స్థానచలనమో టికెట్ ఇవ్వకపోవడమో జరిగే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో అసమ్మతి స్వరాలను నియంత్రించి పార్టీ గెలుపునకు ముందుకు నడిపించడానికి జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. దానికంటే ముందు 16న ఫైనల్ జాబితా వచ్చేస్తే లెక్కలన్నీ ఓ కొలిక్కి వస్తాయి.