తానాలో ఫైటింగ్ సీన్.. సోషల్ మీడియాలో వైరల్
తొలి రోజు డిన్నర్ ముగిసిన తర్వాత కొందరు.. కన్వెన్షన్ హాల్ లో కలుసుకున్నారు. అప్పుడే ఈ కొట్లాట జరిగింది. ఈ గొడవని వైసీపీ సోషల్ మీడియా విభాగం బాగా హైలెట్ చేస్తోంది.
తానాలో ఫైటింగ్ సీన్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) సభల్లో భాగంగా ఓ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. అయితే హుందాగా వ్యవహిరించాల్సిన వారు చివరకు కొట్లాటకు దిగారు. వీధి పోరాటం కంటే అధ్వాన్నంగా కర్రలతో కొట్టుకున్నారు. సూటు బూటు వేసుకుని ఫైటింగ్ సీన్లకు దిగడంతో అక్కడున్నవారంతా షాకయ్యారు.
తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు ఈ ఫైటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరిగింది. 23వ తానా సభలు ఇటీవలే పెన్సిల్వేనియాలో ఘనంగా మొదలయ్యాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. తొలి రోజు డిన్నర్ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కొందరు.. కన్వెన్షన్ హాల్ లో కలుసుకున్నారు. అప్పుడే ఈ కొట్లాట జరిగింది. ఈ గొడవని వైసీపీ సోషల్ మీడియా విభాగం బాగా హైలెట్ చేస్తోంది.
జూనియర్ జిందాబాద్..
కన్వెన్షన్ హాల్ లో జరిగిన చిట్ చాట్ లో ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అనే నినాదాలు చేయడంతో గొడవ మొదలైనట్టు తెలుస్తోంది. వారిని లోకేష్ అభిమానులు వారించారని, అయినా కూడా నినాదాలు ఆగలేదని, దీంతో గొడవ జరిగిందని అంటున్నారు. అందరూ టీడీపీ అభిమానులే కావడం విశేషం. ఆమధ్య ఏపీలో కూడా చంద్రబాబు సభల్లో జూనియర్ నినాదాలు మారుమోగిపోయాయి. ఇప్పుడు ఎన్నారై విభాగంలో కూడా జూనియర్ పేరు వినిపించే సరికి లోకేష్ వర్గం తట్టుకోలేక గొడవకు దిగిందని అంటున్నారు. దీనిపై అధికారిక వివరణ ఇంకా రాలేదు.