ఆర్బీఐకి 3కోట్లు జరిమానా చెల్లించిన టీటీడీ.. ఎందుకో తెలుసా..?

కేంద్రం ఈ లైసెన్స్ రెన్యువల్ చేయకపోవడంతో టీటీడీ జరిమానా కట్టాల్సి వచ్చింది. రెండు విడతల్లో ఆర్బీఐకి 3కోట్ల రూపాయలు జరిమానా కట్టినట్టు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

Advertisement
Update:2023-03-27 21:11 IST

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆర్బీఐ జరిమానా వసూలు చేసింది. ఏకంగా 3కోట్ల రూపాయలు అపరాధ రుసుము కట్టించుకుంది. ఆధ్యాత్మిక సంస్థ నుంచి ఈ స్థాయిలో జరిమానా ఎందుకు కట్టించుకున్నారు. భక్తులు శ్రీవారికి వేసే కానుకలన్నీ ఇలా జరిమానా లెక్కలకే సరిపోతే ఎలా..? అసలీ వివాదం మొదలైందే కానుకల వల్ల. అవును, విదేశీ భక్తులు ఇచ్చే కానుకలకు లెక్కలు చెప్పలేకపోవడంతో టీటీడీ జరిమానా కట్టాల్సి వచ్చింది.

హుండీ సొమ్ముకి లెక్కలెందుకు..?

టీటీడీకి ఇచ్చే విరాళాలకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని అందరికీ తెలుసు, మరిప్పుడు అసలు విరాళాలతోనే సమస్య ఏంటి అనుకుంటున్నారా.. విదేశీ భక్తులు ఇచ్చే విరాళాలను స్వీకరించే సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(FCRA) ప్రకారం ఆర్బీఐ వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. టీటీడీకి ఈ అనుమతి ఉంది. అయితే 2018లో దానికి కాలపరిమితి తీరిపోయింది. రెన్యువల్ చేయించుకోవడంలో సమస్య ఎదురైంది. కేంద్రం ఈ లైసెన్స్ రెన్యువల్ చేయకపోవడంతో టీటీడీ జరిమానా కట్టాల్సి వచ్చింది. రెండు విడతల్లో ఆర్బీఐకి 3కోట్ల రూపాయలు జరిమానా కట్టినట్టు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. FCRA రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

ఈ-హుండీతో తంటా..

ఆన్ లైన్ ద్వారా ఈ-హుండి పేరుతో టీటీడీ విరాళాలు సేకరిస్తుంది. ఎంతో మంది అజ్ఞాత భక్తులు, విదేశీ భక్తులు టీటీడీ ఈ-హుండీకి నగదు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు. కొన్నిసార్లు వీరి వివరాలు టీటీడీకి తెలిసే అవకాశం ఉండదు. వివరాలు లేని అజ్ఞాత భక్తుల ద్వారా టీటీడీకి 26 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇందులో 11.5 కోట్ల విలువైన అమెరికా డాలర్లు ఉన్నాయి. మలేసియా రింగిట్స్ రూ.5.93 కోట్లు, సింగపూర్ డాలర్లు రూ.4.06 కోట్లు ఉంది. FCRA అనుమతి లేకపోవడంతో.. ఆ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. టీటీడీ ఖాతాలో జమ చేయకుండా మూడు సంవత్సరాలుగా కాలం నెట్టుకొచ్చింది. ఈ-హుండీ ద్వారా వచ్చిన విరాళాలకు లెక్కలు చూపించకపోయే సరికి టీటీడీ అపరాధ రుసుము చెల్లించాల్సి వచ్చింది. 

Tags:    
Advertisement

Similar News