కొడుకు మృతదేహంతో.. 8 కిలీమీటర్ల నడక
అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని చినకోనెలకు చెందిన సార కొత్తయ్య కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా కొల్లూరు వద్ద ఇటుకల బట్టీలో పనిచేస్తున్నాడు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంతమంది నాయకులు వచ్చినా.. మౌలిక సదుపాయలకు సైతం నోచుకోని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. రహదారి సౌకర్యం అటుంచితే.. నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో ఉన్నాయి. తాజాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో విషాదకర ఘటన వెలుగు చూసింది.. రహదారి సౌకర్యం లేక తన కుమారుడి మృతదేహంతో ఏకంగా ఎనిమిది కిలోమీటర్లు నడుకుంటూ స్వగ్రామానికి చేరుకుంది ఓ కుటుంబం.
వివరాల్లోకి వెళ్తే.. అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని చినకోనెలకు చెందిన సార కొత్తయ్య కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా కొల్లూరు వద్ద ఇటుకల బట్టీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన చిన్న కుమారుడు ఈశ్వరరావు(3) సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ వారిని మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ వద్ద దించేసి వెళ్లిపోయాడు. గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో మృతదేహాన్ని మోసుకుని కాలినడకన వెళ్లాల్సి వచ్చింది.
చినకూనెలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ వారిని అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మధ్యలోనే దించేసి వెళ్లింది. దీంతో కొడుకు మృతదేహాన్ని చేతులపై వేసుకుని తండ్రి నడక సాగించాడు. కొండలు, గుట్టలు దాటుకుంటూ ఉదయం 8 గంటలకు స్వగ్రామం చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు.