నేతల ఉత్తుత్తి సవాళ్లు.. ఏపీలో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్
పలాస, రాప్తాడు, అనపర్తి, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో ఈ సవాళ్ల డ్రామాలతో రక్తి కట్టించారు నేతలు. ఇదే కోవలో నరసరావుపేట నియోజకవర్గం కూడా చేరింది.
కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడారన్నట్టు ఉంది ఏపీలో రాజకీయ నేతల ఛాలెంజ్‌లు. రోజుకొక నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో తాత్కాలికంగా వార్తల్లోకొస్తున్నారు. కానీ ఛాలెంజ్ చేసేవారు, నిరూపించాల్సిన వాళ్లు మీడియాలో ప్రకటనలు ఇచ్చి జారుకుంటున్నారు. వారం రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో టీడీపీ చేసిన అభివృద్ధి-వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకొచ్చే దమ్ముందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంపీ మిధున్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆయన కూడా తాను రెడీ అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అని లోకేష్ హైదరాబాద్ చేరుకోగా, పార్లమెంటు సమావేశాలు అంటూ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఢిల్లీ వెళ్లిపోయారు. రెండు రోజులు వీరిద్దరి సవాళ్లు, ప్రతిసవాళ్లు ప్రసారం చేసిన మీడియా బకరా అయిపోయింది. ఏపీలో కొన్ని రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలు సవాల్ విసరడం, వైసీపీ నేతలు సై అనడం..తరువాత పోలీసులు ఇరువురు నేతలని గృహనిర్బంధం చేయడంతో కథ సుఖాంతం. ఇరు పార్టీ నేతలూ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడుతున్నారని సామాన్య ప్రజలకి సైతం అనుమానం వస్తోంది. అవన్నీ ఉత్తుత్తి ఛాలెంజులని స్పష్టం అవుతోంది. పలాస, రాప్తాడు, అనపర్తి, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో ఈ సవాళ్ల డ్రామాలతో రక్తి కట్టించారు నేతలు. ఇదే కోవలో నరసరావుపేట నియోజకవర్గం కూడా చేరింది.
నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇసుక, బియ్యం, గుట్కా, మట్కా, గంజాయి, కబ్జాలు తాను నిరూపిస్తానని టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్ బాబు సవాల్ విసిరారు. సవాల్ తాను స్వీకరిస్తున్నానని ప్రకటించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉగాది రోజున కోటప్పకొండ ఆలయంలో ప్రమాణాలకి సిద్ధమన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఉత్తుత్తి సవాళ్లు, మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ మాదిరిగానే టీడీపీ నేత అరవింద్ బాబుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాస్తవంగా వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి ఇద్దరూ డాక్టర్లు కావడంతోపాటు ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉందని ఇరు పార్టీల నేతలకీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ మాత్రం దానికి మీడియా అటెన్షన్, పార్టీ దృష్టిలో ఏదో హడావిడి చేశామని చెప్పుకునేందుకు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.