సబ్జెక్ట్ లోకి వచ్చారు.. మాజీ మంత్రుల్లో మార్పు మొదలైందా..?

మాజీ మంత్రుల ప్రసంగాల్లో మార్పు మొదలైనట్టు తెలుస్తోంది. పూర్తిగా సబ్జెక్ట్ వరకే మాట్లాడి సరిపెడుతున్నారు వైసీపీ నేతలు.

Advertisement
Update:2024-06-21 05:56 IST

మాజీ మంత్రి కొడాాలి నాని.. పూర్తిగా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. మాటల్లో కోపం, అసహనం, వెటకారం ఎక్కడా కనపడ్డంలేదు. రుషికొండ వివరాలన్నీ చెబుతున్నారు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు, వాగ్దానాలు నిలబెట్టుకోవాలని చంద్రబాబుని నిలదీస్తున్నారు. ఎన్నికలకు ముందు, ఫలితాల తర్వాత.. నానిలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది

మరో మాజీ మంత్రి రోజా.. ఇంటర్వ్యూల్లో మునుపటిలాగే కాన్ఫిడెంట్ గా ఉన్నారు కానీ.. పప్పు, తుప్పు, దత్తపుత్రుడు లాంటి పదాలు ఆమె మాటల్లో వెదికినా కనపడ్డంలేదు. పూర్తిగా సబ్జెక్ట్ లోకి వచ్చారు. రుషికొండపై స్పందించారు, ఆడుదాం ఆంధ్రాపై సూటిగా లెక్కలు చెప్పారు. ఈవీఎంలు, పోలింగ్ శాతం.. ఇలా పక్కాగా సబ్జెక్ట్ మాట్లాడారు రోజా. జగన్ ని మరీ మునుపటిలా ఆకాశానికి ఎత్తేయకుండా, ఓటమిపై సమీక్షించుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అంటే రోజా కూడా మారినట్టే అనుకోవాలి.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. తాజాగా ఆయన ఇంటర్వ్యూలు కూడా సబ్జెక్ట్ చుట్టూనే తిరుగుతున్నాయి. రుషికొండలో అసలు ఏం కట్టారు, ఎంత విస్తీర్ణంలో కట్టారు, ఆ భవనాలు, బ్లాక్ ల పేర్లేమిటి..? అక్కడ ఎవరెవరు ఉండొచ్చు.. అనే అంశాలన్నీ సుదీర్ఘంగా వివరించారు అప్పలరాజు. ఎన్నికల ముందు చెప్పాల్సిన అంశాలను కాస్త ఆలస్యంగా అయినా చెప్పుకొచ్చారు. గతంలో లాగా చంద్రబాబుకి మెంటల్ అని, ఆయనకు వైద్యం చేయించాలని, మంచి డాక్టర్ కి చూపించాలని ఇప్పుడు అనడంలేదు. అంటే అప్పలరాజు కూడా ఏదో మార్పు కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.

మాజీ మంత్రి అనిల్ కూడా ఓటమి కారణాల విశ్లేషణలో "మంత్రుల నోటిదూల" అనే పదం వాడారు. ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత అనిల్ ప్రసంగంలో చాలా మార్పులున్నాయి. మీసం తిప్పడం, సవాల్ విసరడం, తొడకొట్టడం.. ఇలాంటివన్నీ ఇప్పుడు లేవు. సూటిగా స్పష్టంగా పల్నాడులో ఏం జరిగింది..? భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? అనే విషయాల గురించి మాట్లాడుతున్నారు అనిల్.

మొత్తానికి కాస్త ఆలస్యంగా అయినా మాజీ మంత్రులు సబ్జెక్ట్ లోకి వస్తున్నారు. గతంలో ప్రెస్ మీట్లు పెట్టి, వైరి వర్గాలను చడామడా తిట్టేసి, చివర్లో జై జగన్ అంటూ ప్రసంగాలు ముగించే నేతలు ఇప్పుడు కాస్త మారినట్టు తెలుస్తోంది. మరి ఈ మార్పు ఎంత మేరకు..? దీనివల్ల ఉపయోగం ఉందా, లేదా..? అనేది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News