ఆడుదాం ఆంధ్రపై అవినీతి ఆరోపణలు హాస్యాస్పదం.. - మాజీ మంత్రి రోజా

విశాఖలోని రిషికొండలో భవనాలపై టీడీపీ బురద చల్లుతోందని రోజా విమర్శించారు. రిషికొండలో నిర్మించినవి పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలని రోజా చెప్పారు.

Advertisement
Update:2024-06-20 16:58 IST

ఆడుదాం ఆంధ్రపై టీడీపీ నేతల అవినీతి ఆరోపణలు హాస్యాస్పదమని మాజీ మంత్రి ఆర్‌కే రోజా చెప్పారు. ఆడుదాం ఆంధ్రకు ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్‌ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. స్కామ్‌ ఇలా కూడా అవుతుందా? అంటూ ఆమె ప్రశ్నించారు. క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా? అని నిలదీశారు. అసలు ఆడుదాం ఆంధ్ర టెండర్లు తమ క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదని ఆమె గుర్తుచేశారు. అలాంటిది తాను, సిద్ధార్థ్‌ రెడ్డి అవినీతి చేశామనడం హాస్యాస్పదమే అవుతుందని రోజా చెప్పారు.

గురువారం తాడేపల్లిలో రోజా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఇది సరికాదని చెప్పారు. ఇప్పటికైనా దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టాలని అన్నారు. ఈవీఎంలపై జగనన్న ట్వీట్‌ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయొచ్చని అనలేదా అని నిలదీశారు.

విశాఖలోని రిషికొండలో భవనాలపై టీడీపీ బురద చల్లుతోందని రోజా విమర్శించారు. రిషికొండలో నిర్మించినవి పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలని రోజా చెప్పారు. తామేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదని తెలిపారు. సెవెన్‌ స్టార్‌ రేంజ్‌లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించామన్నారు. టీడీపీ నేతలు తాము కట్టిన మెడికల్‌ కాలేజీలు, నాడు–నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా ఇలానే చూపించాలని ఆమె చెప్పారు. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించామన్నారు. గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా అని ఆమె ప్రశ్నించారు. కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణతోనే ఈ నిర్మాణాలు చేపట్టామన్నారు. మళ్ళీ 2029లో జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తామని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News