సీఎంఓ నిర్వహణలో మేం విఫలమయ్యాం -పేర్ని నాని
సీఎం జగన్ వల్ల ప్రజలెవరూ నష్టపోలేదని, ఆయన విధానాల వల్ల కేవలం పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలకు మాత్రమే నష్టం జరిగిందని చెప్పారు పేర్ని నాని.
ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి ఇంటర్వ్యూలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ ఓటమిని తనదైన శైలిలో విశ్లేషించారు. చంద్రబాబు అబద్ధాలకు ప్రజలు మోసపోయారని అంటూనే వైసీపీలో ఉన్న లోటుపాట్లను ఆయన ఎత్తిచూపారు. అయితే సీఎం జగన్ వల్ల ప్రజలెవరూ నష్టపోలేదని, ఆయన విధానాల వల్ల కేవలం పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలకు మాత్రమే నష్టం జరిగిందని చెప్పారు. ఓటమిలో అధినేతకు అండగా ఉండేందుకే తాను మీడియా ముందుకొస్తున్నానని వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే తాను రాజకీయంగా పూర్తిగా తెరమరుగయ్యేవాడినని చెప్పుకొచ్చారు నాని.
సీఎంఓ వైఫల్యం..
వైసీపీ హయాంలో సీఎం ఆఫీస్ పనితీరు సరిగా లేదని అన్నారు పేర్ని నాని. సీఎంఓ విఫలమైందని, ఎమ్మెల్యేలకు సీఎం కార్యాలయం అందుబాటులో లేదన్నారు. గతంలో ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు పేర్ని నాని కూడా దీన్ని సమర్థించారు. గుర్రాన్ని రౌతు ఎక్కి సవారీ చేయాలని, గుర్రం రౌతుని తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదని అన్నారు. అలాంటి పరిస్థితులు వైసీపీ హయాంలో నెలకొన్నాయని చెప్పారు నాని.
మళ్లీ నిలబడతాం..
ఓటమి వల్ల వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని, జగన్ మరింత బలంగా నిలబడతారని చెప్పారు పేర్ని నాని. జగన్ మళ్లీ జనంలోకి వస్తే ఆ బాండింగ్ ని ఎవరూ ఆపలేరని కూడా అన్నారు. ఓటమిపై పార్టీలో చర్చించుకున్నామని తమ కార్యాచరణ తమకు ఉందని వివరించారు. మూడు రాజధానుల అంశం తమ ఓటమికి కారణం కాదని అన్నారు నాని. అదే నిజమైతే అమరావతి రాజధానిగా చేసుకున్న చంద్రబాబుకి 2019లో ఆ ప్రాంతంలో కూడా ఓట్లు పడలేదని గుర్తు చేశారు. 2024లో తమకు విశాఖలో కూడా మెజార్టీ రాలేదని చెప్పారు. నాని విశ్లేషణ వైసీపీలో ఓ వర్గానికి పూర్తి స్థాయిలో రుచించదని తెలుస్తోంది.