తాకట్టుపెట్టకుండా అప్పులెవరిస్తారు..?
ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా? అని ప్రశ్నించారు కొడాలి నాని.
ఏపీలో సచివాలయం తాకట్టు వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. సెక్రటేరియట్ తాకట్టు పెట్టారంటూ టీడీపీ రచ్చ చేస్తోంది. అలాంటిదేమీ లేదంటూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) వివరణ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తాజాగా కలకలం రేపాయి. చంద్రబాబుపై నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు తాకట్టు పెట్టకుండా బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు నాని. ఆ మాత్రం చంద్రబాబుకి తెలియదా అని నిలదీశారు.
సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని.. అంటే సచివాలయాన్ని తాకట్టు పెట్టకూడదని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి ఉందా అని ప్రశ్నించారు నాని. గతంలో చంద్రబాబు తాకట్టు పెట్టినవే ఈ ప్రభుత్వం కూడా తాకట్టు పెట్టాలా అని లాజిక్ తీశారు. సచివాలయం అనేది చంద్రబాబు ఆస్తి కాదని, ఆయన బాబు సొత్తు కాదని, అది ప్రభుత్వ ఆస్తి అని వివరణ ఇచ్చారు నాని. అసలు సచివాలయం అనేది 10 ఎకరాల పొలం మాత్రమేనని, దాని విలువ మొత్తం రూ.20 కోట్లు మాత్రమే ఉంటుందన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు నాని.
ప్రస్తుతం ఏపీ అప్పులు రూ. 4 లక్షల కోట్లు ఉంటే.. అందులో రూ. 2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేసిన అప్పులేనని విమర్శించారు కొడాలి నాని. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా? అని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైనప్పుడు.. ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలేనని చెప్పారు నాని.