ఇసుక ఫ్రీ లాగే బస్సు ఫ్రీ పథకం కూడా..

ఇసుక ఉచితం అంటూనే.. ఆ చార్జీలు, ఈ చార్జీలు అంటూ టన్ను రేటుని రూ.1400 చేశారని, ఉచిత బస్సులో కూడా సీటుకి చార్జీలు వసూలు చేస్తారని వైసీపీ నేతలంటున్నారు.

Advertisement
Update:2024-07-12 20:44 IST

ఇసుక ఉచితం - కానీ సీనరేజీ చార్జీలు, రవాణా చార్జీలు కట్టాల్సిందే..

బస్సు ఉచితం - కానీ సీటుకి డబ్బులు కట్టాలి, డీజిల్ చార్జీలు ఇవ్వాలి..

ఏపీలో ఉచిత పథకాల వ్యవహారం ఇలాగే ఉంటుందని సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ఆయన విమర్శలు సంధించారు. ఇసుక ఉచితం అంటూనే.. ఆ చార్జీలు, ఈ చార్జీలు అంటూ టన్ను రేటుని రూ.1400 చేశారని మండిపడ్డారాయన. అంతమాత్రానికి ఉచిత ఇసుక అనడం దేనికని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలకు చేతలకు అస్సలు సంబంధం ఉండదన్నారు. రేపు ఏపీలో ఉచిత బస్సు పథకం కూడా ఇలాగే ఉండబోతోందన్నారు మాజీ మంత్రి గుడివాడ.


తల్లికి వందనంపై సెటైర్లు..

తల్లికి వందనం అంటే ఒక తల్లికి మాత్రమే అని అంటున్నారని, ఇద్దరు పిల్లలకు ఆర్థిక సాయం కావాలంటే రెండు పెళ్లిళ్లు చేసుకోమంటారేమోనని ఎద్దేవా చేశారు గుడివాడ అమర్నాథ్. ఎన్నికల ముందు ఈ కండిషన్లన్నీ ఎందుకు చెప్పలేదని, ఇప్పుడెందుకు కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇద్దరు పిల్లలకు డబ్బులు కావాలంటే, ఇద్దరు తల్లులు కావాలా అని ప్రశ్నించారు.

పెన్షన్లు 4వేల రూపాయలకు పెంచారు సరే, మరి వాలంటీర్లతోనే ఆ డబ్బు ఇప్పించారా అని నిలదీశారు గుడివాడ అమర్నాథ్. టీవీ-5 రిపోర్టర్లని, టీడీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా పెట్టుకోవచ్చుకదా అని అడిగారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఘనతని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. ఎయిర్ పోర్ట్ కి అన్ని అనుమతులు తెచ్చి, భూసేకరణ చేసింది జగనేనని గుర్తు చేశారు అమర్నాథ్. ఆయనకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. గతంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ కి వ్యతిరేకంగా జగన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసింది టీడీపీ. 



Tags:    
Advertisement

Similar News