రుషికొండ భవనాల ప్రత్యేకత అదే.. అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

రుషికొండలో కట్టిన భవనాలు కేవలం జగన్ కోసమే కాదని, రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేశామన్నారు అమర్నాథ్.

Advertisement
Update:2024-06-17 13:42 IST

చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టారని, కానీ తమ హయాంలో విశాఖలోని రుషికొండలో శాశ్వత నిర్మాణాలు చేపట్టామని తెలిపారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రుషికొండ భవనాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భవనాలు జగన్ కి చెందినవిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని, జగన్ ని బద్నాం చేసేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు అమర్నాథ్.

ఎవరైనా ఉండొచ్చు..

రుషికొండలో కట్టిన భవనాలు కేవలం జగన్ కోసమే కాదని, రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేశామన్నారు అమర్నాథ్. ఆ భవనాలను నాలుగు నెలల క్రితమే ప్రారంభించామని, ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారెందుకని ప్రశ్నించారు. విశాఖను రాజధానిగా ప్రకటించాక త్రీమెన్ కమిటీ వేశామని, ఆ కమిటీ సూచనల మేరకే రుషికొండపై భవనాలు నిర్మించామన్నారు అమర్నాథ్. ప్రారంభించిన ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో కొత్త ప్రభుత్వం ఆలోచన చేయాలని సలహా ఇచ్చారు.

గీతంలో జరిగింది చెప్పరేం..?

రుషికొండలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు, గీతం యూనివర్శిటీ విషయంలో ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీమంత్రి గుడివాడ. గీతం యూనివర్శిటీ భూ ఆక్రమణలను కూడా గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేదన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని కూడా టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వివరించాలన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరుగుతోందని, మెడికల్‌ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన ఆసుపత్రి, వాటర్‌ ప్రాజెక్ట్‌, మూలపేటలో పోర్టు, పలు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. వాటిని కూడా ప్రజలకు చూపించాలని కోరారు గుడివాడ. అసలు ప్రజా ధనాన్ని వృథా చేసింది చంద్రబాబేనని విమర్శించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనుల్ని దుబారా అనడంలో అర్థం లేదన్నారు గుడివాడ అమర్నాథ్. 

Tags:    
Advertisement

Similar News