టీడీపీలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు : కొడాలి నాని
రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోందని అన్నారు. బీసీలను మళ్లీ వెనుకకు నెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. దీని వెనుక ఉన్నది చంద్రబాబే అని ఆరోపించారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే నాని.. ఎక్కువగా టీడీపీ, చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు గుప్పిస్తుంటారు. స్వతహాగా జూనియర్‌కు చాలా సన్నిహితుడు, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన నాని.. తెలుగు దేశం పార్టీ నుంచే వైసీపీలోకి వచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కమ్మ సామాజికవర్గంలో నానికి బలమైన లాబీయింగ్ ఉన్నది. గుడివాడ నుంచి వరుసగా గెలుస్తున్న నాని.. జగన్ తొలి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు.
మంత్రి పదవి పోయిన తర్వాత కూడా నాని విమర్శల ఘాటు ఏ మాత్రం కూడా తగ్గలేదు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోందని అన్నారు. బీసీలను మళ్లీ వెనుకకు నెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. దీని వెనుక ఉన్నది చంద్రబాబే అని ఆరోపించారు. తన కొడుకు లోకేశ్‌కు రాజకీయంగా అడ్డం వస్తాడనే జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు తొక్కేస్తున్నారని విమర్శించారు. ఏపీని తిరిగి ఆక్రమించాలని చంద్రబాబు పన్నాగాలు పన్నుతున్నారని నాని అన్నారు.
ఏపీలో మళ్లీ పాగా వేయడానికి ఒక కులం కుట్ర పన్నుతోందని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన సామాజిక వర్గమే రాష్ట్రాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తోందన్నారు. కాగా, కొడాలి నాని అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. తనకు మంత్రి పదవి తీసేసి జోగి రమేష్‌ను మంత్రిని చేయడంపై ప్రత్యర్థులు చేస్తున్న వ్యాఖ్యలకు కూడా నాని చెక్ పెట్టారు. జోగి రమేష్ మంత్రి అయితే నేను, పేర్ని నాని, వల్లభనేని వంశీ మంత్రులు అయినట్లే అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ టీడీపీ చేస్తున్న ఆరోపణలే అని.. తామంతా కులాలకు అతీతంగా ఒకటే అని వెల్లడించారు.
గన్నవరంలో వైసీపీ నేత ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు కొడాలి నాని హాజరయ్యారు. ఆ వివాహానికి టీడీపీ నేత వంగవీటి రాధ వస్తున్నారని తెలుసుకొని మరీ వెయిట్ చేశారు. రాధ రాగానే స్వయంగా నాని వెళ్లి ఆయనను తోడ్కొని వచ్చారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకొని.. వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. కాగా, వీరిద్దరి కలయిక రాజకీయంగా ఆసక్తిరేపింది. ఇద్దరూ వేర్వేరు కులాలు, పార్టీలకు చెందిన వారే. గతంలో వైసీపీలోనే ఉన్న రాధా.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నది.