చర్చా.. రచ్చా.. తగ్గేదే లేదంటున్న సర్కారు.. నేత రాని ప్రతిపక్షం..

ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతానికిపైగా అమలు చేశామని చెప్పి.. ఏమేం చేసిందీ చెప్పనున్నారు. విద్య, వైద్యరంగాల్లో తీసుకొచ్చిన మార్పుల మీద ఆయన ప్రధానంగా చెప్పనున్నట్లు తెలిసింది.

Advertisement
Update:2022-09-15 07:15 IST

ఈరోజు ప్రారంభంకానున్న శాసనసభ సమావేశాలు ఎలా జరుగుతాయన్న చర్చలు సాగుతున్నాయి. వికేంద్రీకరణే తమ ధ్యేయమని చెబుతున్న ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపైన, సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలపైన చర్చకు సిద్ధమంటోంది. మూడు రాజధానుల ఏర్పాటే తమ లక్ష్యమని, తగ్గేదే లేదని చెబుతున్న ప్రభుత్వం ఈ విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరోసారి తన అభిమతాన్ని శాసనసభ వేదికగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం సభలో ఎలా వ్యవహరించాలో బుధవారం చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు నిర్దేశించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అంశాల వారీగా వివరించనున్నట్లు తెలిసింది. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలు, తాము తీసుకున్న చర్యలు, ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు పూసగుచ్చినట్లు వివరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతానికిపైగా అమలు చేశామని చెప్పి.. ఏమేం చేసిందీ చెప్పనున్నారు. విద్య, వైద్యరంగాల్లో తీసుకొచ్చిన మార్పుల మీద ఆయన ప్రధానంగా చెప్పనున్నట్లు తెలిసింది.

సామాజిక న్యాయం అమలు చేస్తున్న తీరును వివరిస్తూ నామినేటెడ్ పదవులు, అందులో పాటించిన కులాలవారీ సమతూల్యతలను వివరిస్తూ ఆయా వర్గాలను ఆకట్టుకోనున్నారు. మరో ప్రధాన అంశం.. నేరుగా నిధుల పంపిణీ గురించి వివరించి ప్రతిపక్షం నుంచి ఎవరూ మాట్లాడకుండా చేయాలనేది అధికారపక్ష వ్యూహంగా ఉంది.

టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం

చంద్రబాబునాయుడు ఇంతకుముందు ప్రకటించిన మేరకు అసెంబ్లీకి హాజరుకారని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే ఆయన ముందురోజే సభలో ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీ ఎమ్మెల్యేలకు సూచనలిచ్చినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవాలని, అమరావతి కోసం జరుగుతున్న పాదయాత్రను ప్రస్తావించాలని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఏదో ఒక రకంగా సభాకార్యక్రమాలను అడ్డుకోవాలని సూచించినట్లు సమాచారం. వాకౌట్ చేసిగానీ, బయటకు పంపేలా చేసుకునిగానీ మైలేజీ పెంచుకునే ప్రయత్నాలు చేయాలని వారు చర్చించినట్లు తెలిసింది.

తమకు అనుకూలంగా ఉన్నటీడీపీ ఎమ్యెల్యేలతో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడించాలని అధికారపక్షం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే అధికారపక్షం వైపు ఉన్న ఆ టీడీపీ ఎమ్యెల్యేలు మాట్లాడింది సాంకేతికంగా తెలుగుదేశం వాయిస్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ సమావేశాలు చాలా హాట్ గా జరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News