జగన్ ని ప్రశ్నిస్తూ రోడ్డుమీదే మంచం వేసి వెరైటీ నిరసన

వర్షాలకు నీరు చేరిన రోడ్డుపై మంచం వేసి పడుకున్నాడు. ఆర్టీసీ బస్సు వచ్చినా కూడా లేవలేదు, అక్కడ్నుంచి మంచం తీయలేదు.

Advertisement
Update:2023-07-23 11:46 IST
జగన్ ని ప్రశ్నిస్తూ రోడ్డుమీదే మంచం వేసి వెరైటీ నిరసన
  • whatsapp icon

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి తీవ్రంగా చర్చకు వచ్చింది. గత ప్రభుత్వం నాసిరకంగా రోడ్లు వేసిందని, దానికి తామెలా బాధ్యత వహిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు వేసింది. మధ్యలో జనసేన కూడా శ్రమదానం పేరుతో హడావిడి చేసింది. కానీ ఇప్పటికీ అక్కడక్కడా రోడ్ల దుస్థితిపై నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఏలూరు వద్ద రోడ్డు మడుగులా తయారైంది. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు.

ఏలూరు నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డు మొత్తం గుంతల మయంగా మారింది. ఇటీవల పడుతున్న వర్షాలకు మరింత అధ్వాన్నంగా తయారైంది. ఫిల్ హౌస్ పేట అనే ప్రాంతంలో రోడ్డు కనిపించదు, మడుగులో నీరు నిల్వ ఉన్నట్టు రోడ్డు మారిపోయింది. స్థానిక ఎమ్మెల్యేకి, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఓ యువకుడికి కడుపుమండింది. వర్షాలకు నీరు చేరిన రోడ్డుపై మంచం వేసి పడుకున్నాడు. రోడ్డుపై ఆర్టీసీ బస్సు వచ్చినా కూడా లేవలేదు, అక్కడ్నుంచి మంచం తీయలేదు. ఆ యువకుడి నిరసన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


రోడ్డుపై మంచం వేసుకుని నిరసన తెలిపిన యువకుడికి స్థానికులు సర్దిచెప్పారు. కాసేపటి తర్వాత ఆ యువకుడు మంచం దిగి పక్కకు వచ్చాడు, మంచాన్ని అడ్డు తీసేయడంతో బస్సు ముందుకు వెళ్లింది. ఈ వెరైటీ నిరసన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆ యువకుడికి మద్దతుగా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వీడియో చూసిన తర్వాతయినా నాయకులు ముందుకు కదులుతారేమో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News