ఈనాడు రామోజీగారి వంటావార్పూ: హద్దులు దాటిన 'చంద్రబాబు' పిచ్చి

వైఎస్‌ జగన్‌పై వ్యతిరేకతతో చంద్రబాబుకు అనుకూలంగా వార్తాకథనాలను వడ్డించడానికి దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెల్లారి ఆ పసుపు పత్రికను చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది.

Advertisement
Update:2024-01-22 12:14 IST

రామోజీరావుగారి ఈనాడు టిడిపి అనుకూల పత్రిక అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో వచ్చే వార్తాకథనాలకు విలువలు ఏపాటివో కూడా అందరికీ తెలుసు. కానీ, చెప్పిందే చెప్పడం ద్వారా అబద్ధాన్ని నిజం చేసే విద్యను ఈనాడు అనుసరిస్తూ వస్తున్నది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కోసం రామోజీరావు తన ప్రతిష్టను పూర్తిస్థాయిలో దిగిజార్చుకోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. పత్రికా విలువలకు తిలోదకాలిచ్చి తన పత్రికను చంద్రబాబు తాకట్టు పెడుతున్నారు. ఇంతవరకు సరే, కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను దెబ్బ తీయడానికి ఈనాడు ప్రతిరోజూ ఏదో ఒక అబద్ధపు వార్తాకథనాన్ని ప్రచురించడం ఆనవాయితీగా చేసుకుంది. అందుకు తాజా ఉదాహరణ `రాష్ట్రానికి జగన్‌ దెబ్బ` అనే శీర్షికతో కృష్ణపట్నం ఓడరేవుపై రాసిన వార్తాకథనం. అది అబద్ధాల పుట్ట అనే విషయం వాస్తవమైన గణాంక వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతారణాన్ని జగన్‌ ప్రభుత్వం దెబ్బ తీసిందని, అది పోర్టు ఎగుమతులపై ప్రభావం చూపిందని ఒక అందమైన అబద్ధాన్ని చెప్పడానికి ఈనాడు తెరతీసింది. కృష్ణపట్నం ఓడరేవు నుంచి సరుకు రవాణా భారీగా తగ్గిందని, గతంలోని 6 లక్షల మిలియ‌న్‌ టన్నుల సరుకు రవాణా జరగగా జగన్‌ ప్రభుత్వంలో లక్ష మిలియన్‌ టన్నులకు పడిపోయిందని వ్యాఖ్యానించింది. వార్తాకథనం రాసే ముందు అధికారిక లెక్కలను, వాస్తవ గణాంకాలను తీసుకోవాలనే కనీస జర్నలిజం విలువలను ఈనాడు ఎప్పుడో గాలికి వదిలేసింది. తాజాగా వైఎస్‌ జగన్‌పై వ్యతిరేకతతో చంద్రబాబుకు అనుకూలంగా వార్తాకథనాలను వడ్డించడానికి దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెల్లారి ఆ పసుపు పత్రికను చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది.

అసలు వాస్తవాలు ఏమిటో చూద్దాం..

కృష్ణపట్నం ఓడరేవులో 2020 - 21 వార్షిక సంవత్సరం సరుకు రవాణా 3.81 కోట్లు ఉండగా అది 2022 - 23లో 4.82 కోట్లకు పెరిగింది. 2023 - 24 సంవత్సరంలో 5.78 కోట్ల సరుకు రవాణా జరుగుతుందని అంచనా. దీన్నిబట్టి చూస్తే సరుకు రవాణా పెరిగిందా, తగ్గిందా అనేది చిన్నపిల్లాడికైనా అర్థమైపోతుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎగుమతుల్లో కూడా దూకుడు ప్రదర్శిస్తున్నది. 2023 - 24 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ 4.88 శాతం వాటాను సాధించింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఏదో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2022 - 23లో 4.40 శాతంతో ఆరో స్థానంలో నిలిచింది. అంటే ఏటేటా ఎగుమతుల్లో ప్రగతి సాధిస్తున్నట్లా, లేదా అనే ప్రశ్న వేసుకోవాలి.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎగుమతులు గత ఆరు నెలల్లో 2.77 శాతం వృద్ధితో రూ.85,021.74 కోట్లకు చేరాయి. కర్ణాటక ఎగుమతులు 9.06 శాతం, మహారాష్ట్ర ఎగుమతులు 7.04 శాతం, గుజరాత్‌ ఎగుమతులు 7.91 శాతం మేర తగ్గాయి.

కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా ఈనాడు ప్రదర్శించలేదని ఇట్లే అర్థమైపోతుంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తిరోగ‌మనంలో ఉంటే కృష్ణపట్నం ఓడరేవును నిర్వహిస్తున్న ఆదానీ గ్రూపు గంగవరం ఓడరేవులో కొత్త రెండు కార్గో టెర్మినళ్లను ఎందుకు నిర్వహిస్తుందనే ప్రశ్నను కూడా ఈనాడు వేసుకోలేకపోయింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద విషం చిమ్మడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈనాడు ఆ ప్రశ్న వేసుకుంటుందని అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది.

ఏపిలోని ఓడరేవుల్లో ఎగుమతుల పెరుగుదల ఈ విధంగా ఉంది.

2019 - 20లో రూ.1.04,829 కోట్లు

2022 - 23లో రూ.1,59,368 కోట్లు

2023 - 24 (తొలి ఆరు నెలల్లో) రూ. 85,022 కోట్లు

పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతే ఏపి పోర్టుల నుంచి సరుకు రవాణా నాలుగేళ్లలో రూ.54,539 కోట్లకు అదనంగా ఎలా పెరుగుతుందనేది గమనించే స్థితిలో కూడా ఈనాడు లేదు. సరుకు రవాణాపై ప్రభుత్వ ఖజానాకు వస్తున్న రాయల్టీనైనా పరిగణనలోకి తీసుకోవాలనే కనీస జ్ఞానాన్ని కూడా ప్ర‌దర్శించలేదు. 2020 - 21లో రాయల్టీ రూ.46.06 కోట్లు వస్తే, 2023 - 24లో రూ.88.91 కోట్లకు పెరిగింది.

ఈనాడు చంద్రబాబు కోసం జగన్‌ను దెబ్బ తీయడమే పనిగా పెట్టుకుంది కాబట్టి కనీసమైన ఇంగితాన్ని కూడా మరిచిపోయంది. తప్పుడు వార్తాకథనాలతో ప్రజల మనసు మార్చాలనే ఈనాడు కుయుక్తులు చెల్లవు గాక చెల్లవు. వాస్తవాలను ప్రజలు అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. ఈనాడు ఎవరి పక్షమో కూడా వారికి తెలుసు.

Tags:    
Advertisement

Similar News