వై ఏపీ నీడ్స్ జగన్..? ఈనాడు సెటైర్
టీడీపీ తరపున ఈనాడు కౌంటర్ ఇచ్చినా, ఇవ్వకపోయినా.. వైసీపీ కోసం సాక్షి ఆ స్థాయిలో ధీటుగా జవాబిస్తుందనుకోవడం అపోహే. అందుకే ఆ పని సోషల్ మీడియా తీసుకుంది.
ఎన్నికల వేళ వైసీపీ సరికొత్త కార్యక్రమాలతో దూసుకొస్తోంది. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు వంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్..? అనే మరో కార్యక్రమం మొదలు కాబోతోంది. అసలు ఏపీకి జగనే సీఎంగా మరోసారి ఎందుకు కావాలి..? మళ్లీ వైసీపీనే ఎందుకు అధికారంలోకి రావాలి..? అంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చూస్తున్నారు. నిన్న ప్రకటించిన ఈ కార్యక్రమానికి ఈరోజు ఈనాడులో కౌంటర్ పడింది. ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి..? అంటూ ఓ కార్టూన్ వేశారు.
ఎందుకు కావాలంటే..?
- సీపీఎస్ రద్దు చేసి మాటనిలబెట్టుకున్నందుకు..
- మద్య నిషేధం విధించి ప్రజల ప్రాణాలు కాపాడినందుకు
- ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేసినందుకు
- పన్నులు, ధరలను కంట్రోల్ చేసినందుకు
- రాష్ట్రాన్ని అప్పుల ఊబినుంచి కాపాడినందుకు
- కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలు సాధించినందుకు
- ప్రతిపక్ష నేతలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నందుకు
ఈ విజయాలన్నీ సాధించినందుకే మళ్లీ జగన్ ని ఎన్నుకోవాలంటూ ఈనాడు కార్టూన్ లో సెటైర్ పేల్చారు.
పోనీ చంద్రబాబు ఎందుకు కావాలి..?
టీడీపీ తరపున ఈనాడు కౌంటర్ ఇచ్చినా, ఇవ్వకపోయినా.. వైసీపీ కోసం సాక్షి ఆ స్థాయిలో ధీటుగా జవాబిస్తుందనుకోవడం అపోహే. అందుకే ఆ పని సోషల్ మీడియా తీసుకుంది. అసలు చంద్రబాబు ఎందుకు కావాలో చెప్పండని నిలదీస్తున్నారు నెటిజన్లు.
- 2014 మేనిఫెస్టోని సోషల్ మీడియా నుంచి మాయం చేసినందుకా..?
- ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన కొడుకుని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చినందుకా..?
- రైతు రుణమాఫీ పేరుతో కుచ్చుటోపీ పెట్టినందుకా..?
- టిడ్కో ఇళ్లు అసంపూర్తిగా మిగిల్చినందుకా..?
- వర్షానికి ఉరిసే సెక్రటేరియట్ కట్టినందుకా..?
- పుష్కరాల్లో ప్రచార ఆర్భాటం కోసం ప్రజల్ని పొట్టనపెట్టుకున్నందుకా..?
- అమరావతి పేరుతో మొండిగోడలు మిగిల్చినందుకా..?
- ఎన్నికల వేళ ఇతర పథకాల నిధులతో పసుపు-కుంకుమలు అంటూ ఎరవేసినందుకా..?
- 23మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా లాగేసుకుని, మంత్రి పదవులు కూడా ఇచ్చినందుకా..?
- హోదా వద్దు, ప్యాకేజీ చాలు అంటూ నాలుక మడతపెట్టినందుకా..?
- స్కిల్ కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్ లలో ఇరుక్కుని జైలు ఊచలు లెక్కబెడుతున్నందుకా..?
అంటూ సోషల్ మీడియాలో ఈనాడుపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగలేదు, ఇంకా చాలానే ఉంది. నవరత్నాల హామీలను దాదాపుగా సీఎం జగన్ అమలు చేశారని, మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దులో ఇబ్బందులున్నందుకే వేచి చూస్తున్నారని అంటున్నారు. మొత్తమ్మీద, ఈనాడు వేసిన కార్డూన్, సోషల్ మీడియాలో టీడీపీ, చంద్రబాబు పరువునే బజారుకీడ్చిందని తేలిపోయింది.