పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు ఈసీ వార్నింగ్

ఏపీలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పెట్రోల్ బంకులపై ఆంక్షలు అమలులో ఉంటాయి.

Advertisement
Update:2024-05-19 07:53 IST

ఏపీలో ఎన్నికల హింస పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు, పల్లెల్లో పెట్రోల్, డీజిల్.. బాటిళ్లలో పోసి అమ్ముకునే చిరు వ్యాపారులకు కష్టాలు తెచ్చి పెట్టింది. ఇకపై పెట్రోల్ ని విడిగా అమ్మొద్దని యాజమాన్యాలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అలా అమ్మారని తేలితే ఆయిల్ బంకుల లైసెన్స్ లు రద్దు చేస్తామని చెప్పింది. అన్ని బంకుల యాజమాన్యాలకు నోటీసులిచ్చింది.

ఎందుకంటే..?

ఏపీలో చాలా చోట్ల ఎన్నికల కారణంగా హింస చెలరేగింది. ఎన్నికల తర్వాత కూడా అది కంటిన్యూ అవుతోంది. చాలా చోట్ల పెట్రోల్ బాంబులు విసురుకున్నారు ప్రత్యర్థులు. వాహనాలను కూడా పెట్రోల్, డీజిల్ పోసి తగలబెట్టారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టింది. ఓవైపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా దర్యాప్తు చేయిస్తూనే మరోవైపు అల్లర్లు జరగకుండా పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది.

ఏపీలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పెట్రోల్ బంకులపై ఆంక్షలు అమలులో ఉంటాయి. కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు రౌడీ బ్యాచ్ నుంచి తమకు బెదిరింపులు ఉంటాయని విజయవాడలోని పెట్రోల్ బంకుల యజమానులు భయపడిపోతున్నారు. రాత్రిపూట బ్లేడ్ బ్యాచ్ కి చెందిన వారు వస్తుంటారని, పెట్రోల్ పోయకపోతే బంకులు తగలబెడతామని వాళ్లు బెదిరిస్తుంటారని అంటున్నారు. రాత్రి వేళ పెట్రోల్ బంకులకు పోలీస్ రక్షణ కావాలని యజమానులు కోరుతున్నారు. ఈ ఆంక్షలు కేవలం పెట్రోల్ బంకుల యాజమాన్యాలకే కాదు, రిటైల్ గా పెట్రోల్, డీజిల్ అమ్ముకునే చిరు వ్యాపారులకు కూడా ఇబ్బందిగానే ఉంటాయని తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News