అదే మా చిత్తశుద్ధికి నిదర్శనం -డిప్యూటీ సీఎం పవన్
వైసీపీ తరపున గెలిచిన సర్పంచ్ లు ఉన్నా కూడా, గ్రామ పంచాయతీలకు తాము నిధులిస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీలోని 13,326 గ్రామ పంచాయతీల్లో 70శాతం వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన సర్పంచ్ లే ఉన్నారని, అయినా తాము రాజకీయాల్ని పట్టించుకోకుండా సర్పంచ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గ్రామాలకు కావాల్సినన్ని నిధులు సమకూరుస్తున్నామని అన్నారు. అదే తమ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు మండలం మైసూరావారి పల్లెలో జరిగిన గ్రామ సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. రైల్వే కోడూరు మండలంలో నేల సారవంతమైందని, అది జిల్లాకే ప్రత్యేకంగా మారిందని అన్నారు. తాను ఈ ప్రాంతం నుంచి మామిడి మొక్కలు తెప్పించుకునేవాడినని అన్నారు పవన్. రైల్వే కోడూరుని పండ్ల రాజధానిగా చేస్తామని, ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామన్నారు.
రాయల సీమ అంటే గొడవలే కాదని, చదువుల నేల ఇదని చెప్పారు పవన్ కల్యాణ్. కోస్తా జిల్లాలకంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న ప్రాంతం రాయలసీమ అని అన్నారు. రాయలసీమ యువతకు తెగింపు ఉందని, సుగాలి ప్రీతి ఘటన జరిగినప్పుడు తాను కర్నూలుకి వస్తే లక్షన్నర మంది యువత మద్దతుగా వచ్చారని గుర్తు చేశారు. రాయలసీమకు ప్రచారానికి వచ్చినప్పుడే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బలమైన భావన తనకు కలిగిందన్నారు పవన్.
అద్భుతాలు చేయడానికి తన వద్ద మంత్రదండం లేదని, కానీ గుండెలనిండా కమిట్ మెంట్ ఉందని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాష్ట్రం అప్పుల్లో ఉందని, కానీ సీఎం చంద్రబాబు అనుభవం వల్ల పెరిగిన పెన్షన్లు ఇవ్వగలిగామని గుర్తు చేశారు. తనకు ప్రజాదరణ ఉందని, కానీ చంద్రబాబుకి పరిపాలనా అనుభవం ఉందని చెప్పారు పవన్. అనుభవజ్ఞుడి వద్ద పనిచేయడానికి, ఆయన వద్ద నేర్చుకోడానికి తానెప్పుడూ వెనకాడబోనన్నారు. తనకు డిప్యూటీ సీఎం పోస్ట్ అలంకారం కాదని, అది బాధ్యత అని చెప్పారు. ప్రజల కోసం కూలీలాగా పనిచేయడానికి వెనకాడబోనన్నారు. గ్రామ సభలతో పారదర్శకత, జవాబుదారీ తనం పెరుగుతుందన్నారు పవన్. ప్రతి ఏడాదీ ప్రతి గ్రామంలో నాలుగు గ్రామ సభలు పెడతామన్నారు.