మళ్లీ మొదలైన రాజధాని విరాళాలు

చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 4.5 కోట్లు విరాళం ఇచ్చారు.

Advertisement
Update: 2024-06-26 01:31 GMT

గతంలో రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజల్ని కూడా భాగస్వాముల్ని చేస్తామని చెప్పారు చంద్రబాబు. ఆన్ లైన్ లో విరాళాల సేకరణ ప్రారంభించారు. ఒక్కో ఇటుకకు ఇంత అని రేటు కట్టి వెబ్ సైట్ ద్వారా నిధుల సేకరణ జరిగింది. వైసీపీ హయాంలో అసలు అమరావతి ఊసే లేకుండా పోయింది, అమరావతి భూములపై ఎంక్వయిరీ కూడా మొదలైంది. ఇప్పుడు మళ్లీ టీడీపీ చేతికి అధికారం వచ్చింది. సీఎం చంద్రబాబు మళ్లీ అమరావతి నిర్మాణం అంటూ పనులు మొదలు పెడుతున్నారు. ఇందులో భాగంగా అప్పుడే విరాళాల సేకరణ మొదలైంది. చంద్రబాబు కుప్పం పర్యటనలో పెద్ద ఎత్తున అమరావతికోసం విరాళాలు ఇచ్చారు మహిళలు. డ్వాక్రా, మెప్మా సంఘాల నేతలు భారీ విరాళం ఇచ్చి తమ ప్రత్యేకత చాటుకున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 4.5 కోట్లు విరాళం ఇచ్చారు. కుప్పం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబుకి చెక్కులను అందించారు. చంద్రబాబు కృషి వల్లే చాలా ఎత్తుకు ఎదిగామని చెబుతున్న డ్వాక్రా, మెప్మా సంఘాల ప్రతినిధులు రాజధానికోసం ఇది తమవంతు సాయం అని చెప్పారు. రాజధాని లేని రాష్ట్రంగా ఇన్నాళ్లూ అవమానం పాలైన ఏపీ ఇప్పుడు తలెత్తుకుంటుందన్నారు. చంద్రబాబుతోనే రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందన్నారు మహిళలు.

గతంలో అమరావతి విషయంలో హడావిడి జరిగిందే కానీ పనులు జరగలేదు. జరిగిన తాత్కాలిక నిర్మాణాల్లో కూడా నాణ్యత లోపం కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ సారి ఆ తప్పులేవీ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు సీఎం చంద్రబాబు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇక అమరావతిపై ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు. అయితే ఈసారి మాత్రం రాజధానిలో నిర్మాణాలు, కార్యకలాపాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అమరావతి విషయంలో మాటలకు, చేతలకు పొంతన ఉంటేనే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి ఉంటుంది. 

Tags:    
Advertisement

Similar News