చంద్రబాబుపై అనుమానాలు పెరిగిపోతున్నాయా..?

బీజేపీ లేకుండా జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు భయపడుతున్నారు. ఇదే సమయంలో కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

Advertisement
Update:2023-12-30 11:16 IST

బెంగళూరు ఎయిర్ పోర్టులో జరిగిన డెవలప్మెంట్ కారణంగా చంద్రబాబునాయుడుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. కుప్పంకు వెళ్ళటానికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన చంద్రబాబు బెంగళూరు విమనాశ్రయంలో దిగారు. అక్కడి ఎయిర్ పోర్టులో కర్నాటక కాంగ్రెస్ అధ్య‌క్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎదురుపడ్డారు. ఇద్దరు ఎదురుపడటం అన్నది కాకతాళీయం కావచ్చు.. ప్రీ ప్లాన్డూ కావచ్చు. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వెళ్ళిపోలేదు. పక్కకు పోయి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. దాంతో చంద్రబాబుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ ఆ అనుమానం ఏమిటంటే.. రాబోయే ఎన్నికల్లో జనసేనను పక్కనపెట్టేసి చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారా అని. ఎందుకీ అనుమానం అంటే చంద్రబాబు వైఖరి బాగా తెలియటం వల్లే. అధికారం కోసం చంద్రబాబు ఏమిచేయటానికైనా వెనకాడరు. ఎవరితో పొత్తు పెట్టుకుంటే తాను అధికారంలోకి వస్తానని చంద్రబాబు అనుకుంటే వెంటనే ఎలాంటి మొహమాటం లేకుండా ఆ పార్టీతో చేతులు కలిపేస్తారు. అప్పటివరకు తాను కలిసున్న పార్టీని పక్కనపెట్టేస్తారు. జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి వచ్చేట్లయితేనే పొత్తుకు చంద్రబాబు రెడీ అయ్యారు. కానీ, బీజేపీ మాత్రం ఏమీ చెప్పటంలేదు.

తమతో కలిసొస్తుందని బీజేపీపై పవనే ఆశలు వదిలేసుకున్నారు. అయితే బీజేపీ లేకుండా జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు భయపడుతున్నారు. ఇదే సమయంలో కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏపీలో కూడా ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉంది. అందుకనే వైఎస్ షర్మిలను చేర్చుకుని పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆలోచిస్తున్నది.

షర్మిలకు పార్టీపగ్గాలు అప్పగించటం వల్ల ఉపయోగం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటున్నది. పొత్తు విషయంలో కాంగ్రెస్-జనసేన రెండింటితోనూ చంద్రబాబుకు ప్లస్సులు, మైనస్సులున్నాయి. వైసీపీలోని అసంతృప్తులు కాంగ్రెస్‌లో చేరి పోటీచేసేట్లయితే కాంగ్రెస్‌కు కొంచెం ఊపు వస్తుంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే టీడీపీ ఎక్కువ సీట్లు కేటాయించాల్సిన అవసరంలేదు. కాంగ్రెస్‌తో కాకుండా జనసేనతోనే పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లు కేటాయించాల్సుంటుంది.

పైగా కాపుల ఓట్లు టీడీపీకి ట్రాన్స్ ఫర్ అవుతుందని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకోవటం, చంద్రబాబే ముఖ్యమంత్రవ్వటం కాపుల్లోనే చాలామందికి నచ్చటంలేదు. అదే కాంగ్రెస్‌తో పొత్తంటే చంద్రబాబుకు చాలా సమస్యలు క్లియరైపోతాయి. కాబట్టి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి రావటం ఖాయమని అనుకుంటే చంద్రబాబు జనసేనను పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదనే ప్రచారం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత డీకేతో చంద్రబాబు ఏకాంతంగా చర్చలు జరపటమే. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News