జగన్‌ను నారా లోకేష్‌ కూడా అడిగితే ఏమైనా ఉందా..?

ప్రత్యేక హోదా అనే హామీని అటకెక్కించింది నారా లోకేష్‌ తండ్రి నారా చంద్రబాబు నాయుడు కాదా..? ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్తే మురిసిపోయి సరేనన్నది చంద్రబాబు నాయుడు కాదా..?

Advertisement
Update:2024-02-15 09:21 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. అలా అడగడానికి లోకేష్‌ ఏ మాత్రం సిగ్గుపడుతున్నట్లు కనిపించలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఎవరో ఆయనకు తెలియదా..? లేదంటే మరిచిపోయారా..? ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా అని ఆయన ప్రశ్నించారు. మొన్నటికి మొన్న వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగిన విషయాన్ని ఆయన పట్టించుకున్నట్లు లేదు. అయితే, మోడీని అడిగారో లేదో తనకెలా తెలుస్తుందని ఆయన అమాయకంగా అడగనూ వచ్చు.

ప్రత్యేక హోదా అనే హామీని అటకెక్కించింది నారా లోకేష్‌ తండ్రి నారా చంద్రబాబు నాయుడు కాదా..? ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్తే మురిసిపోయి సరేనన్నది చంద్రబాబు నాయుడు కాదా..? ప్రత్యేక హోదా వల్ల అభివృద్ధి జరగదని కొన్ని ఇతర రాష్ట్రాల ఉదంతాలను కూడా చంద్రబాబు అప్పట్లో వల్లె వేశారు. ఆ విషయం చిన‌బాబు చిన్న‌ బుద్ధికి తట్టకపోవచ్చు.

లోకేష్‌ తన శంఖారావం సభల్లో వైఎస్‌ జగన్‌ను విమర్శించడం తప్ప తాము ఏం చేస్తామనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో నారా లోకేష్‌ చెప్పగలరా..? ఆయన చెప్పలేరు. ఎందుకంటే, అటువంటి ప్రణాళిక ఏదీ చంద్రబాబు వద్దనే లేదు, ఇక ఆయనేం చెప్పుతారు?

Tags:    
Advertisement

Similar News