పార్టీ బతకాలంటే.. ‘బాద్‌షా’ రావాల్సిందేనా..!
ఎన్నికలు దగ్గరపడుతున్న ప్రస్తుత పరిస్థితిలో టీడీపీకి పటిష్టమైన నాయకత్వం కావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌ని మించినవారు లేరని కేడర్ భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు, కేడర్‌లో అంతర్మథనం మొదలైందా.. అంటే అవుననే సమాధానమే ఆ పార్టీలో వస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి.. రిమాండ్‌పై జైలులో ఉండటం వారికి మింగుడుపడటం లేదు. ఒకపక్క ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో.. పార్టీని నడిపించే నేత జైలులో ఉండటంతో ఆయన స్థానంలో పార్టీని ముందుకు నడిపే సరైన నాయకుడెవరో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కూడా ఈ కేసులో అరెస్టయ్యే అవకాశముందని రూమర్లు వినిపిస్తుండటంతో ఇక పార్టీకి నాయకత్వం వహించేదెవరు అనే ఆలోచన వారి మదిని తొలిచేస్తున్నట్టు సమాచారం.
పార్టీని స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్ అయినప్పటికీ..
నిజానికి తెలుగుదేశం పార్టీని స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్ కాగా.. ఆయన తన సినీ గ్లామర్‌తో పాటు అతి తక్కువ కాలంలోనే రాజకీయ పరిణతి సాధించి.. ఏపీ రాజకీయాల్లో విజయవంతమైన నేతగా నిలిచారు. చంద్రబాబు ఆయన నుంచి పార్టీని లాక్కున్న అనంతరం తనదైన రాజకీయాలతో ఆయన ముందుకు నడిపిస్తూ వచ్చారు. తాజాగా స్కిల్ స్కామ్‌లో శుక్రవారం నాడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. న్యాయస్థానం ఆయనకు మరో రెండు రోజులపాటు రిమాండ్ పొడిగించడంతో పాటు.. విచారణ నిమిత్తం సీఐడీ కస్టడీకి అనుమతించడం విశేషం. మరోపక్క హైకోర్టులోనూ ఆయన తరఫున వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పరిణామాలతో చంద్రబాబు ఇప్పట్లో బయటికి వస్తారో లేదో అన్న డైలమాలో కేడర్ కొట్టుమిట్టాడుతున్నారు.
ఇక ఈ కేసులో లోకేశ్‌ని కూడా అరెస్ట్ చేస్తే ఆయన బయటికి రావడం కష్టమేనంటున్నారు. అంతేగాక ఇప్పటికే పాదయాత్ర రూపంలో రాష్ట్రమంతటా పర్యటిస్తున్నా లోకేశ్‌కి ఎలాంటి మైలేజీ దక్కలేదనేది పలువురు నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబు విషయమే గమనిస్తే.. ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతూ ఆయన్ని బయటికి రానీయకుండా జైలు లోపలే ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించినా.. అనుభవం లేమి, వాక్ పటిమ లేకపోవడం, రాజకీయాలపై సరైన అవగాహన లేకపోవడం మైనస్‌లుగా మారుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన రాజకీయ వారసత్వం కంటే ఈ సంక్లిష్ట సమయంలో టీడీపీని కాపాడుకోవడమే ముఖ్యమని ఆ పార్టీలో అసలైన కార్యకర్తలు, యువ నేతలు తీవ్రంగానే చర్చిస్తున్నట్టు సమాచారం.
ఒకే ఒక్క ఆప్షన్.. జూనియర్ ఎన్టీఆర్..!
ఎన్నికలు దగ్గరపడుతున్న ప్రస్తుత పరిస్థితిలో టీడీపీకి పటిష్టమైన నాయకత్వం కావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌ని మించినవారు లేరని కేడర్ భావిస్తున్నారు. నారా ఫ్యామిలీ అంటూ వారి చుట్టూ అల్లుకుని పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసుకోవడం కంటే నందమూరి వారి అసలైన బ్లడ్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌కే పార్టీ పగ్గాలు అప్పగిస్తే కేడర్‌లో ఉత్సాహం పొంగిపొర్లుతుందని, పార్టీకి జవజీవాలు వచ్చే అవకాశముంటుందని భావిస్తున్నారు. మరోపక్క చంద్రబాబుకు వయసు పెద్ద అడ్డంకిగా మారడం, లోకేశ్‌కి పాదయాత్ర చేసినా ఇమేజ్ పెద్దగా పెరగకపోవడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీలో కీలకం చేసి బాధ్యతలు అప్పగిస్తే జోష్ ఫుల్ గా వస్తుందని, వైఎస్సార్‌సీపీ వంటి బలమైన పార్టీని ఢీ కొట్టడానికి జూనియర్‌కి మించిన లీడర్ ఉండరని అంటున్నారు. మరి దీనికి జూనియర్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. అంతకంటే ప్రధానంగా చంద్రబాబు దీనికి అంగీకరించే అవకాశమే లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందన్నది వేచిచూడాల్సిందే.