ఈనెల 20 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ
ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏయే వ్యాధులకు చికిత్స అందజేస్తారో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్ఓల సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 20 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ దఫా మొత్తం 1.42 కోట్ల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. తాజాగా సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ పై జరిగిన సమీక్షలో అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఏపీలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలను ప్రజలు ఉచితంగా వినియోగించుకునేలా ఆరోగ్యశ్రీ కార్డుపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏయే వ్యాధులకు చికిత్స అందజేస్తారో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్ఓల సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్యం కోసం పేదలు చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
దిశ యాప్ మాదిరిగానే ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్‌లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయించాలని సూచించారు. జనవరి 1నుంచి ప్రారంభం కానున్న రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు సకాలంలో మందులు అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.