రిషితేశ్వరి కేసు కొట్టివేత..తల్లిదండ్రుల ఆవేదన
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కోట్టేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రిషితేశ్వరి సూసైడ్ కేసును గుంటూరు కోర్టు కోట్టేసింది. నాగార్జున యూనివర్సిటీలో 2015 జులై 14న ర్యాంగింగ్ వేధింపులతో తాను బలవన్మరణానికి పాల్పడుతానని లేఖలో యువతి పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగా పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో సుదీర్ఘకాలం విచారణ జరిగింది. దాదాపు 9 ఏళ్ల పాటు ఈ కేసులు విచారణ కొనసాగింది. అయితే సరైన సాక్షాలు లేని కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య కేసును శుక్రవారం గుంటూరు కోర్టు జడ్జి కొట్టివేశారు. దీంతో ఈ కేసు నిందితులకు ఊరట లభించింది. 2015లో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు అనధికారికంగా తనకు నచ్చిన చోట ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి.
ప్రిన్సిపల్‌తో పాటు పలువురు విద్యార్థులు మద్యం సేవించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారని, సీనియర్ విద్యార్థులు సైతం ఆమెపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదైంది. సీనియర్ల ర్యాగింగ్‌కు మనస్తానం చెందిన రిషితేశ్వరి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విచారణ తర్వాత గుంటూరు కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. న్యాయం కోసం పోరాటం చేస్తామని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తామని చెప్పారు. పైకోర్టులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేదని, ప్రభుత్వమే సాయం చేయాలని కోరారు. కేసులో న్యాయం జరగకపోతే మరణమే శరణ్యమని రిషితేశ్వరి తల్లిదండ్రులు పేర్కొన్నారు. తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు.