ఇది కదా అభివృద్ధి అంటే.. – జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన కోన వెంకట్
ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రి అని పొరపాటు పడకండి.. అత్యాధునికంగా ఎన్నో సదుపాయాలతో కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా ఉన్న ఈ ఆస్పత్రి బాపట్లలోని ప్రభుత్వ ఆస్పత్రి అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఆయన తన సొంతూరైన బాపట్లకు వెళ్లారు. అక్కడి ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన కోన వెంకట్.. ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన అత్యాధునిక సదుపాయాలను చూసి అచ్చెరువొందారు. అంతేకాదు.. అక్కడి వసతులను తన సెల్‌ఫోన్‌లో బంధించి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆస్పత్రిలో చికిత్సకు వచ్చే పేదల కోసం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులను చూసి తాను ఆశ్చర్యపోయానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో పసి పిల్లల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చూసి తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఉద్వేగానికి గురవుతూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలను పంచుకున్నారు.
సోషల్ మీడియాలో ఆస్పత్రిలోని వసతుల ఫొటోలను షేర్ చేసిన కోన వెంకట్.. ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రి అని పొరపాటు పడకండి.. అత్యాధునికంగా ఎన్నో సదుపాయాలతో కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా ఉన్న ఈ ఆస్పత్రి బాపట్లలోని ప్రభుత్వ ఆస్పత్రి అని పేర్కొన్నారు. అప్పుడే జన్మించిన శిశువుల కోసం ఏర్పాటు చేసిన ఐసీయూ వార్డు చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం చేస్తున్న నిజమైన అభివృద్ధి అంటే ఇదే కదా అంటూనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు.