గజపతిన`గరం గరం`గా తమ్ముళ్ల పోరు
టీడీపీ అధిష్టానం అప్పలనాయుడు, శివరామకృష్ణల సీటు పోటీ మధ్యలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమీక్షలను వరుసగా పూర్తి చేస్తున్నారు పార్టీ అధినేత. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో రోజుకి మూడు నియోజకవర్గాల వరకూ రివ్యూ చేస్తున్నారు. ఒక్కో నియోజకర్గానికి పాత ఇన్‌చార్జిలను ప్రకటిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాలకి కొత్త ఇన్‌చార్జిలను నియమిస్తున్నారు. వర్గపోరున్న స్థానాలలో మాత్రం ఎటూ తేల్చకుండానే సమీక్షలు ముగిస్తున్నారు. ఈ జాబితాలో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం చేరింది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గజపతినగరం నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. టీడీపీ నియోజకర్గ ఇన్‌చార్జి కొండపల్లి అప్పలనాయుడు, మరో నేత కరణం శివరామకృష్ణలతో అధినేత వేర్వేరుగా మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్న గ్రూపు రాజకీయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్గపోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జిపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో మరోసారి గజపతినగరం రివ్యూ చేయాలని నిర్ణయించారు.
టీడీపీ అధిష్టానం అప్పలనాయుడు, శివరామకృష్ణల సీటు పోటీ మధ్యలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అప్పలనాయుడు అన్న కొండపల్లి కొండలరావు తనయుడు కొండపల్లి శ్రీనివాస్ అభ్యర్థి అయితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. గతంలో వైసీపీలోకి వెళ్లిన శ్రీనివాస్ ప్రస్తుతం టీడీపీతో కంటిన్యూ అవుతున్నారు. క్లీన్ ఇమేజ్, రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించిన శ్రీనివాస్‌కి టీడీపీ టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలున్నాయని నివేదికల నేపథ్యంలో సీటు కోసం త్రిముఖ పోటీ తప్పడంలేదు.
ప్రస్తుత ఇన్‌చార్జిగా కొండపల్లి పైడితల్లినాయుడు తనయుడు వారసత్వంగా తనకే టికెట్ ఇవ్వాలంటూ కేఏ నాయుడు పట్టుబడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆశీస్సులతో కరణం శివరామకృష్ణ తనకే సీటివ్వాలంటున్నారు. అధిష్టానం మాత్రం కొండపల్లి శ్రీనివాస్ వైపు చూస్తోంది. చివరికి ఏ సమీకరణాలు నెగ్గి ఎవరు అభ్యర్థి అవుతారో చూడాలి మరి..