ఒక్క ఓటమితో తేడా తెలిసిపోయిందా?
జైలు జీవితం, 2014లో ఓటమి జగన్‌లో కసి, పట్టుదలను పెంచితే 2019 ఎన్నికల్లో ఓటమి చంద్రబాబును రాజమండ్రి వైపుకు తీసుకెళ్ళింది.
ఒకే ఓటమితో ఇద్దరి మధ్య తేడా ఏమిటో తెలిసిపోయిందా? క్షేత్రస్థాయిలో వ్యవహారాలు చూస్తేం అవుననే అనిపిస్తోంది. 2019లో టీడీపీ ఘోర ఓటమి దెబ్బకు చంద్రబాబునాయుడులో ఉన్న భయం, బేలతనం మొత్తం బయటపడిపోయింది. స్కిల్ స్కామ్‌లో అరెస్టు తర్వాత అవినీతి బాగోతాలన్నీ ఒకదాని తర్వాత మరోకటి తెరపైకి వస్తుంటే తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇదే సమయంలో పార్టీలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయ నాయకత్వం లేదన్న విషయం జనాలందరికీ అర్థమైపోయింది.
చంద్రబాబు 22 రోజులుగా జైలులో ఉంటేనే పార్టీ మొత్తం ఇలాగైపోయితే ఇక ఎన్నికల సమయానికి కూడా జైలులోనే ఉండక తప్పదని తేలిపోతే పార్టీ భవిష్యత్తేంటి? పార్టీలో తన తర్వాత ఎవరినీ చంద్రబాబు ఎదగనీయకపోవటమే ఇప్పుడు పార్టీ దుస్థితికి ప్రధాన కారణమని చెప్పాలి. లోకేష్ సామర్థ్యం ఏంటో పార్టీ నేతల్లోనే కాదు మొత్తం జనాలకందరికీ బాగా తెలుసు. అందుకనే లోకేష్‌ను ప్రత్యామ్నయ నాయకుడిగా చూడకుండా బ్రాహ్మణిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక చరిత్రలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయం చూద్దాం. అప్పట్లో జగన్ పైన కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను నమోదు చేసి విచారణ పేరుతో సీబీఐ అరెస్టు చేసింది. కేసుల మీద కేసులు వేసి 16 మాసాలు జైలులోనే ఉంచేసింది. నెలల తరబడి జైలులోనే ఉన్నా జగన్ నిబ్బరం కోల్పోలేదు. పార్టీలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. తన తరపున రాష్ట్రంలో పర్యటించే బాధ్యతను విజయమ్మ, షర్మిలకు అప్పగించారు. ఒకవైపు పార్టీ వ్యవహారాలను చక్కపెడుతునే మరోవైపు కేసులను ఎదుర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే జగన్ జైలులో ఉన్నా పార్టీకి విపరీతమైన క్రేజు వచ్చింది.
2014 ఎన్నికల్లో ఓడిపోయినా ధైర్యం కోల్పోలేదు. తన ఎమ్మెల్యేలు, ఎంపీలను చంద్రబాబు లాక్కున్నా తొణకలేదు. ప్రత్యేక హోదా కోసం పార్టీ చేసిన ఆందోళనలను ప్రభుత్వం అడ్డుకున్నా పట్టించుకోలేదు. అన్నీవైపుల నుండి తనపై ఎంత దాడి జరిగినా బెదరకుండా పాదయాత్ర చేసి ఎన్నికలకు పార్టీని సిద్ధంచేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. జైలు జీవితం, 2014లో ఓటమి జగన్‌లో కసి, పట్టుదలను పెంచితే 2019 ఎన్నికల్లో ఓటమి చంద్రబాబును రాజమండ్రి వైపుకు తీసుకెళ్ళింది.
♦