వైసీపీలో మరో అసంతృప్తి స్వరం.. జక్కంపూడి బాటలో కేతిరెడ్డి
వందలసార్లు సీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా ధర్మవరం ఫ్లైఓవర్ కోసం 20కోట్ల రూపాయలు మంజూరు చేయించుకోలేకపోయానని అన్నారు కేతిరెడ్డి.
మా తప్పేం లేదు, ప్రజలే మమ్మల్ని మోసం చేశారంటూ వైసీపీలో కొందరు నేతలు ఓటమికి వివరణలు ఇచ్చుకుంటున్నారు. అయితే అతికొద్ది మంది మాత్రం జగన్ చుట్టూ ఉన్న కోటరీని టార్గెట్ చేశారు. ఓటమికి అదే ప్రధాన కారణం అంటున్నారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇటీవల కోటరీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి కూడా ఇలాంటి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. సీఎంని కలవకుండా తమకు సీఎంఓ అడ్డుగా నిలిచిందని, అందుకే తమ ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం ఆలస్యమైందని, వైసీపీ ఓటమికి అది కూడా ఓ కారణం అని అన్నారాయన. జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు కేతిరెడ్డి.
జగన్ సంక్షేమ పథకాలపై ఉన్న నమ్మకంతోపాటు, స్థానికంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో కొంతమంది నేతలు తమ విజయం గ్యారెంటీ అనుకున్నారు. వారు కూడా ఈసారి కూటమి వేవ్ ని తట్టుకోలేకపోయారు. దీంతో వారి ఆవేదన అంతా ఇలా బయటపడుతోంది. వందలసార్లు సీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా ధర్మవరం ఫ్లైఓవర్ కోసం 20కోట్ల రూపాయలు మంజూరు చేయించుకోలేకపోయానని అంటున్నారు కేతిరెడ్డి.
అధిష్టానం సైలెన్స్..
జగన్ మెప్పుకోసం మాట్లాడేవారు ఇంకా అదే పంథాలో ఉన్నారు. ఇకనైనా అధినేతకు నిజాలు తెలియాలని కోరుకునేవారు మాత్రం కాస్త కష్టమైనా ఇలా బయటపడుతున్నారు. జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఈ బాటలో ఇంకెవరైనా ఉన్నారేమో చూడాలి. అయితే వీరి వ్యాఖ్యల్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తూ జగన్ ని టార్గెట్ చేయడం విశేషం. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఇలా బయటపెట్టుకోవడం సరికాదనేది మరికొందరి వాదన. మరి సొంతపార్టీ నేతలు చెబుతున్న కఠిన వాస్తవాలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.