సూరీ కాదు, శ్రీరామ్ కాదు.. సత్య వచ్చాడు
సత్యకుమార్ పేరుకు బీజేపీ జాతీయ కార్యదర్శి అయినా కమలం పార్టీకి చేసిందేమీ లేదు. వెంకయ్యనాయుడు పవర్‌లో ఉన్నప్పుడు ఆయన పీఏగా ఆయన వ్యవహారాలన్నీ చక్కబెట్టారు.
రెండు కోతుల రొట్టె ముక్క కథలో పిల్లి దూరి మొత్తం తినేసినట్లయింది ధర్మవరం అసెంబ్లీ టికెట్ పరిస్థితి. తొలుత పరిటాల శ్రీరామ్‌కు అని.. తర్వాత వరదాపురం సూరికి అని ఊరించిన చంద్రబాబు చివరికి ఆ స్థానాన్ని బీజేపీకి అప్పగించేశారు. అక్కడి నుంచి కూడా బీజేపీలో ఉన్నా తనకు బాగా నమ్మకస్తుడైన సత్యకుమార్‌కు ఇచ్చేలా చక్రం తిప్పారు. మొత్తంగా ధర్మవరం టికెట్ కథ శ్రీరామ్ పోయి సూరి వచ్చె ఢాం ఢాం ఢాం.. సూరి పోయి సత్య వచ్చె ఢాం ఢాం ఢాం అన్నట్లుగా తయారయింది.
సూరి వెళ్లిపోయాడని శ్రీరామ్‌కు అప్పగించి..
2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ధర్మవరంలో ఓడిపోయిన వరదాపురం సూరి తర్వాత బీజేపీలో చేరిపోయారు. అదీ చంద్రబాబు సూచనతోనే వెళ్లారంటారు. అలా ఏ దిక్కూ లేని ధర్మవరాన్ని పరిటాల శ్రీరామ్‌కు అప్పగించారు చంద్రబాబు. ఇంకేముంది మా అమ్మకు రాప్తాడు, నాకు ధర్మవరం రెండు టికెట్లు అని సంబరపడి, ధర్మవరంలో మూడేళ్లపాటు పార్టీని లాక్కొచ్చారు పరిటాల రవి వారసుడైన శ్రీరామ్. తీరా మళ్లీ ఎన్నికలొచ్చేసరికి బీజేపీలో ఉన్న సూరిని పార్టీలోకి తీసుకొచ్చి సీటు కట్టబెట్టాలని బాబు ప్లాన్ చేశారు.
మధ్యే మార్గంగా బీజేపీకి
చంద్రబాబు ఎత్తులతో చిత్తయిన పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో సూరికి టికెటిస్తే కుదరదంటూ తేల్చిచెప్పేశారు. చంద్రబాబు సభ సందర్భగా శ్రీరామ్, సూరి వర్గీయులు కొట్లాటకూ దిగారు. ఇలా ఉంటే సీటు పోతుందని తేలిపోవడంతో చంద్రబాబు ఎలర్టయ్యారు. దాన్ని బీజేపీకి వదిలేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ స్థానంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు టికెటిచ్చింది కమలం పార్టీ.
పార్టీ వేరయినా మనోడే
సత్యకుమార్ పేరుకు బీజేపీ జాతీయ కార్యదర్శి అయినా కమలం పార్టీకి చేసిందేమీ లేదు. వెంకయ్యనాయుడు పవర్‌లో ఉన్నప్పుడు ఆయన పీఏగా ఆయన వ్యవహారాలన్నీ చక్కబెట్టారు. అలా చంద్రబాబుకూ దగ్గర మనిషిగానే మెలిగారు. ఇప్పుడు ఆయనకే టికెటివ్వడం ద్వారా పేరుకు బీజేపీ అయినా ఆ టికెట్ మన ఖాతాలోనేనని చంద్రబాబు వర్గం భావిస్తోంది.