నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం కొట్టు?
కొట్టును నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా నిలపాలని సీఎం జగన్ చాలాకాలంగా భావిస్తున్నట్లు, ఆ విషయాన్ని ఆయన దగ్గర చెప్పారని కూడా అంటున్నారు.
నరసాపురంలో తమ సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వపక్షంలోనే సైంధవ పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆయనకు ప్రత్యామ్నాయం కోసం వైసీపీ చాలా రోజులుగా ఆలోచిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను నరసాపురం లోక్‌సభ బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ త్వరలో ప్రకటించబోయే 5వ జాబితాలో ఈ మార్పు ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొట్టు ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి తన సీటు పరిస్థితి ఏమిటని ఆరా తీశారు.
జగన్ మనసులో ఎప్పటి నుంచో ఆలోచన
కొట్టును నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా నిలపాలని సీఎం జగన్ చాలాకాలంగా భావిస్తున్నట్లు, ఆ విషయాన్ని ఆయన దగ్గర చెప్పారని కూడా అంటున్నారు. అయితే తన కుమారుడు కొట్టు విశాల్‌కు తాడేపల్లిగూడెం సీటిస్తే తాను నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని అప్పట్లో కొట్టు సీఎంకు చెప్పినట్లు ప్రచారం జరిగింది.
తాడేపల్లిగూడెం నుంచి యీలి నాని!
కొట్టును నరసాపురం పంపితే తాడేపల్లిగూడెం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యీలినాని పేరును తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు ఫోన్లు చేసి నాని అభ్యర్థి అయితే ఎలా ఉంటుంది, ఆయన బలాబలాలేంటని ఆరా తీస్తున్నారు. ఆర్థిక స్థితిగతులపైనా వివరాలు తెలుసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో చిరంజీవి కూడా ఓడిపోయినా ప్రజారాజ్యం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే యీలి నాని. మాజీ మంత్రి దివంగత యీలి ఆంజనేయులు కుమారుడైన నానికి క్లీన్ ఇమేజ్ ఉండటం, ఆ కుటుంబానికి దశాబ్దాలుగా ఉన్న ఓటు బ్యాంకు కలిసొస్తాయన్నది వైసీపీ ఆలోచన. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్న నాని యాక్టివ్‌గా లేరు. వైసీపీ ఆహ్వానిస్తే వెళ్లడానికి వెనకాడరు.