పూడిమడక విషాదం.. అందరి మృతదేహాలు లభ్యం..

మత్స్యకారులు ధైర్యం చేసి అలల మధ్యకు వెళ్లారు, సూరిశెట్టి తేజ అనే విద్యార్థిని వారు కాపాడారు. కాసేపటి తర్వాత సూర్యకుమార్ అనే విద్యార్థి మృతదేహాం అదే తీరానికి కొట్టుకొచ్చింది.

Advertisement
Update:2022-07-31 07:59 IST

పూడిమడక విషాదంలో గల్లంతయిన విద్యార్థులందరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో సెర్చింగ్ ఆపరేషన్ పూర్తయింది. గల్లంతయినవారి కోసం రెండు రోజులుగా నేవీ సహకారంతో అధికారులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు మాత్రం ఒకరి ప్రాణాలు కాపాడగలిగారు. ఆ ఒక్క విద్యార్థి ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొత్తం ఆరుగురు కడలి కెరటాలకు బలయ్యారు.

అనకాపల్లిలోని దాడి ఇంజినీరింగ్‌ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న 15మంది విద్యార్థులు, పరీక్షలు పూర్తయిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాంబిల్లి మండలం పూడిమడక సముద్రతీరానికి వెళ్లారు. విశాఖ, అనకాపల్లి, గుంటూరు, గుడివాడ ఇలా వేర్వేరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ గ్రూప్ లో ఉన్నారు. ఏడుగురు విద్యార్థులు సముద్ర స్నానాలకు దిగారు. మిగతావారంతా బయట ఆడుకుంటున్నారు. ఏడుగురు విద్యార్థులు గల్లంతు కావడంతో మిగతావారు స్థానిక మత్స్యకారుల సాయం కోరారు. మత్స్యకారులు ధైర్యం చేసి అలల మధ్యకు వెళ్లారు, సూరిశెట్టి తేజ అనే విద్యార్థిని వారు కాపాడారు. కాసేపటి తర్వాత సూర్యకుమార్ అనే విద్యార్థి మృతదేహాం అదే తీరానికి కొట్టుకొచ్చింది.

రెండురోజులపాటు సెర్చింగ్ ఆపరేషన్..

పూడిమడక విషాద ఘటన తెలిసిన వెంటనే సీఎం జగన్ కూడా స్థానిక అధికారులకు సూచనలు చేశారు. నేవీ సహాయంతో రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. నేవీ హెలికాప్టర్ల సహాయంతో అధికారులు వెదుకులాట ప్రారంభించారు. కానీ ఫలితం లేదు. ఒక్కొక్క మృతదేహాన్ని మాత్రం గుర్తించి బయటకు తీసుకురాగలిగారు. గల్లంతైన వారి మృతదేహాలన్నీ బయటకు తెచ్చారు. ఈ ఘటనలో సముద్రంలో మునిగిన ఏడుగురిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా.. మొత్తం ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇలా ఒకేసారి ఆరుగురు స్టూడెంట్స్ కడలి కెరటాలకు బలైన దుర్ఘటనలు ఇటీవల కాలంలో జరగలేదు. వారిపైనే ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబాలన్నీ కన్నీరు మున్నీరవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News