9 కాదు 12.. బాబు ప్రమాణస్వీకారం తేదీలో మార్పు
చంద్రబాబు నాయుడు ఈసారి సీఎంగా పగ్గాలు చేపడితే నాలుగు సార్లు సీఎంగా ప్రమాణం చేసిన ఏకైక తెలుగు సీఎంగా రికార్డులకెక్కనున్నారు.
ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయాల్సిన తేదీ మారింది. ఏపీలో కూటమి విజయం తర్వాత జూన్ 9న చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ నెల 8న ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తర్వాతి రోజే ఇక్కడ ప్రమాణస్వీకారం అంటే ఇబ్బందులు ఉంటాయని పార్టీ వర్గాలు భావించాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రమాణస్వీకార తేదీని ఈనెల 12కు మార్చినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు ఈసారి సీఎంగా పగ్గాలు చేపడితే నాలుగు సార్లు సీఎంగా ప్రమాణం చేసిన ఏకైక తెలుగు సీఎంగా రికార్డులకెక్కనున్నారు. ప్రమాణస్వీకార ఏర్పాట్ల కోసం ఇప్పటికే హైదరాబాద్ నుంచి 12 లారీల్లో సామగ్రిని తరలించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ఎక్కడ చేస్తారన్నది క్లారిటీ లేదు. ఇప్పటివరకూ స్థలం ఎంపిక జరగలేదు. ప్రమాణస్వీకారం చేసే స్థలంపై ఇవాళ క్లారిటీ రానుంది.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్రమంత్రులు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది.