ఈనాడుకు దసపల్లా కమలాదేవి లీగల్ నోటీసులు

దసపల్లా భూములపై రాణి కమలాదేవి సుదీర్ఘంగా న్యాయపోరాటం చేశారని 2009లో ఈ భూములు రాణి కమలాదేవికే చెందుతాయని హైకోర్టు తీర్పు ఇచ్చిందని నోటీసుల్లో గుర్తు చేశారు.

Advertisement
Update:2023-01-12 08:27 IST

విశాఖ దసపల్లా భూములపై ఈనాడు పత్రిక ప్రచురించిన కథనాన్ని తప్పుపడుతూ రాణి కమలాదేవి పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. "దసపల్లాపై అత్యుత్సాహం " పేరుతో ఈనాడు పత్రిక బుధవారం ఒక కథనాన్ని ప్రచురించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములను వ్యూహాత్మకంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారంటూ ఆ కథనంలో ఆరోపించింది. నిషిద్ధ జాబితా నుంచి ఇంకా తొలగించకుండానే దసపల్లా భూముల్లో పనులు చేస్తున్నారంటూ ఈనాడు పత్రిక ఆరోపించింది.

ఈ కథనంపై అభ్యంతరం తెలుపుతూ ఆమె తరఫు న్యాయవాది అరుణ్ దేవ్ ఈనాడు ఎడిటోరియల్ డైరెక్టర్, ఎడిటర్, ఈనాడు దినపత్రికకు నోటీసులు జారీ చేశారు. పూర్తి అవాస్తవాలతో ఈనాడు పత్రిక కథనాన్ని ప్రచురించి రాణి కమలాదేవి ప్రతిష్టను దెబ్బతీసిందని నోటీసుల్లో అభ్యంతరం తెలిపారు. అసత్య కథనంపై ఈనాడు పత్రిక సవరణ వార్తను ప్రచురించకపోతే కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో రాణి కమలాదేవి న్యాయవాది హెచ్చరించారు.

దసపల్లా భూములపై రాణి కమలాదేవి సుదీర్ఘంగా న్యాయపోరాటం చేశారని 2009లో ఈ భూములు రాణి కమలాదేవికే చెందుతాయని హైకోర్టు తీర్పు ఇచ్చిందని నోటీసుల్లో గుర్తు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించిందన్నారు. ప్రభుత్వ పరిధి నుంచి ఈ భూములను తొలగించి సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటించాలంటూ జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు దిశా నిర్దేశం చేసిందని వివరించారు.

ఈ భూములు పూర్తిగా రాణి కమలాదేవికి చెందినవని న్యాయస్థానాలు చెప్పిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగానే ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని అభ్యంతరం తెలిపారు.

Tags:    
Advertisement

Similar News