ఏపీలో తుపాను తీరం దాటేది అక్కడే..

దక్షిణ కోస్తా జిల్లాల అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. విపత్తు నిర్వహణ సంస్థ కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది. అత్యవసర సమయాల్లో 1070, 112, 18004250101 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు అధికారులు.

Advertisement
Update:2023-12-02 07:42 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఈరోజు అది తీవ్ర వాయుగుండంగా మారుతుందని, ఆదివారానికి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో ఆది, సోమ వారాల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు అధికారులు. సోమవారానికి తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో మంగళవారం కూడా వర్షాలు కురుస్తాయంటున్నారు.

ఏపీలో ముఖ్యంగా దక్షిణకోస్తా ప్రాంతంలో తుపాను ప్రభావం ఎక్కువగా కనపడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశముందన్నారు. మంగళవారానికి తుపాను తీరం దాటినా.. దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాలో అత్యంత భారీ వర్షాలు పడతాయన్నారు.

తుపాను కేంద్రం..

పుదుచ్చేరికి 730 కి.మీ., చెన్నైకి 740 కి.మీ, నెల్లూరుకు 860 కి.మీ, బాపట్లకు 930 కి.మీ, మచిలీపట్నానికి 910 కి.మీ. దూరంలో ప్రస్తుతం వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్నారు అధికారులు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా బలపడుతుందని తెలిపారు. ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి సోమవారం నాటికి నెల్లూరు-మచిలీపట్నం మధ్యలో తీరం దాటేందుకు అవకాశముందన్నారు. దక్షిణ కోస్తా జిల్లాల అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. విపత్తు నిర్వహణ సంస్థ కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది. అత్యవసర సమయాల్లో 1070, 112, 18004250101 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు అధికారులు. 

Tags:    
Advertisement

Similar News