చంద్ర‌బాబు కోసం బీజేపీ తీర్మానం

బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలోనూ చంద్ర‌బాబు అరెస్టును వ్య‌తిరేకిస్తూ చేసిన తీర్మానం వెనుకా పురందేశ్వ‌రి ఉంద‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Advertisement
Update:2023-11-21 12:40 IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో ఎంత ద‌గ్గ‌రి బంధుత్వ‌మున్నా ఆరేడు నెల‌ల కింద‌టి వ‌ర‌కు ఉప్పూ నిప్పులా ఉన్న పురందేశ్వ‌రి.. ఇప్పుడు అదే టీడీపీ కోసం త‌న పార్టీ బీజేపీని బ‌లిపెడుతున్నారా..? అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో చంద్ర‌బాబు అరెస్ట‌యిన‌ప్ప‌టి నుంచి పురందేశ్వ‌రి వైఖ‌రిలో చాలా స్ప‌ష్ట‌మైన మార్పొచ్చింది. టీడీపీ నాయ‌కులను మించిపోయి వైసీపీ ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలోనూ చంద్ర‌బాబు అరెస్టును వ్య‌తిరేకిస్తూ చేసిన తీర్మానం వెనుకా పురందేశ్వ‌రి ఉంద‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

లోకేష్‌ను అమిత్‌షాతో క‌లిపించారు

స్కిల్ స్కామ్ కేసులో చంద్ర‌బాబు అరెస్ట‌యి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లోకి వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కేంద్ర పెద్ద‌ల‌ను ముఖ్యంగా హోం మంత్రి అమిత్‌షాను క‌లిసేందుకు విశ్వ‌ప్ర‌యత్నాలు చేశారు. కానీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. అలాంటిది ఒక‌రోజు రాత్రిపొద్దుపోయాక అమిత్‌షా ఇంట్లో లోకేష్ క‌నిపించారు. ప‌క్క‌నే పెద్ద‌మ్మ పురందేశ్వ‌రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి కూడా ఉన్నారు. దీంతో అమిత్‌షా అపాయింట్‌మెంట్ పురందేశ్వ‌రి పుణ్య‌మే అని ప్ర‌పంచానికి తెలిసిపోయింది.

అరెస్ట‌యిన 3 నెల‌ల త‌ర్వాత తీర్మాన‌మా?

చంద్ర‌బాబు అరెస్ట‌యి 52 రోజులు జైల్లో ఉన్నారు. బెయిల్‌పై బ‌య‌టికొచ్చి కూడా 20 రోజుల‌వుతుంది. ఇంత స‌మ‌యం గ‌డిచాక నిన్న ఒంగోలులో జ‌రిగిన రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో చంద్ర‌బాబు అరెస్టును ఖండిస్తూ తీర్మానం చేసింది బీజేపీ. ప్రజాస్వామ్యాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా బీజేపీ సమర్థించ‌దు. అవినీతి, అరాచకాల్లో ఏ పక్షానికి కొమ్ముకాయదని ఆ తీర్మానం సారాంశం. రాజకీయ కక్ష సాధింపులకంటే, పాలనపై దృష్టిపెట్టాలని వైసీపీ ప్ర‌భుత్వానికి స‌ల‌హా కూడా ఇచ్చేశారు. ఈ స్క్రిప్ట్ చూస్తేంటే ఇదంతా పురందేశ్వ‌రి పట్టుబ‌ట్టి చేయించింద‌ని ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అయితే టీడీపీని బ‌తికించ‌డానికి పురందేశ్వ‌రి బీజేపీని బ‌లిపెడుతున్నార‌ని ఆ పార్టీ సీనియ‌ర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News