ప్రత్యేక హోదాపై మౌనం.. రాష్ట్రానికి అన్యాయం చేయడమే

గత ప్రభుత్వ వైఫల్యాలకే పరిమితమైన గవర్నర్‌ ప్రసంగం.. ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన కొత్త ప్రభుత్వం వారి ఆకాంక్షలు ఎలా నెరవేర్చుతుందనే విషయాన్నే ప్రస్తావించలేదని గుర్తుచేశారు.

Advertisement
Update: 2024-07-23 05:26 GMT

పార్లమెంట్‌ అఖిలపక్ష భేటీలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ ప్రస్తావించకపోవడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తప్పుబట్టారు. అఖిలపక్ష భేటీలో ఇతర పార్టీలు ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టినా.. టీడీపీ సభ్యులు మౌనం వహించడం రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని ఆయన మండిపడ్డారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన టీడీపీపై ఈ విమర్శలు చేశారు.

ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు..

రాష్ట్రంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని వి.శ్రీనివాసరావు విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలకే పరిమితమైన గవర్నర్‌ ప్రసంగం.. ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన కొత్త ప్రభుత్వం వారి ఆకాంక్షలు ఎలా నెరవేర్చుతుందనే విషయాన్నే ప్రస్తావించలేదని గుర్తుచేశారు. గవర్నర్‌ ప్రసంగంలో విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారని, ఆ లోటును పూడ్చడానికి అవసరమైన ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు ప్రస్తావన చేయకపోవడం అన్యాయమని తెలిపారు.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా కాపాడుకునేందుకు నిర్దిష్టమైన ప్రకటన ఏదీ గవర్నర్‌ ప్రసంగంలో చేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గుర్తుచేశారు. ఇక పోలవరం నిర్వాసితుల ప్రస్తావనే గవర్నర్‌ ప్రసంగంలో లేకపోవడం విస్మయానికి గురిచేసిందని తెలిపారు. గవర్నర్‌ ప్రసంగం సాగిన తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో ప్రజలపై అదనపు భారాలు మోపేందుకు అవసరమైన నేపథ్యాన్ని సృష్టించేదిగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News