ఆ పొత్తు రాష్ట్రానికి వినాశకరం.. - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు దేశమంతా తిరిగి బీజేపీ మతోన్మాదాన్ని పెద్ద ఎత్తున చాటారని వి.శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మతోన్మాద బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడమేనని ఆయన స్పష్టంచేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు దేశమంతా తిరిగి బీజేపీ మతోన్మాదాన్ని పెద్ద ఎత్తున చాటారని వి.శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం దారుణమని చెప్పారు. మత విద్వేషాలు రగిలించి మైనార్టీల మీద దాడులు చేస్తున్న బీజేపీతో కలిసి టీడీపీ మైనార్టీలను ఎలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై చంద్రబాబు క్రిస్టియన్లకు, దళితులకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. దళితులు, ఆదివాసీలు, బలహీనవర్గాలను ఎలా ఉద్ధరిస్తారని నిలదీశారు. బీజేపీతో టీడీపీ పాత్తు రాష్ట్రానికి వినాశకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రానికి మరణశాసనం రాస్తున్నాయని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలను ప్రజలు చిత్తుగా ఓడించాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.