‘పోలవరం’పై పవన్‌ వ్యాఖ్యలకు సీపీఎం ఆగ్రహం

తమ సర్వస్వాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు చెల్లించవలసిన పరిహారాన్ని బిచ్చమెత్తి (క్రౌడ్‌ ఫండింగ్‌) సేకరిస్తామని పవన్‌ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు

Advertisement
Update:2024-05-02 09:22 IST

పోలవరం ప్రాజెక్టుపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంగళవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ప్రచారం నిర్వహించిన పవన్‌ కళ్యాణ్‌ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, పరిహారం నిమిత్తం రాష్ట్ర ప్రజలపై సెస్సు విధిస్తామని ప్రకటించారు. పవన్‌ వ్యాఖ్యలపై సీపీఎం ఘాటుగా స్పందించింది.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రాష్ట్ర ప్రజల నెత్తిన పోలవరం పన్ను వేసేలా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. పవన్‌ వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణ బాధ్యత సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వానిదేనని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

అయినప్పటికీ నిర్వాసితుల పునరావాసం, పరిహారం నిమిత్తం రాష్ట్ర ప్రజలపై సెస్సు విధిస్తామని పవన్‌ ప్రతిపాదించడం గర్హనీయమని పేర్కొన్నారు. తమ సర్వస్వాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు చెల్లించవలసిన పరిహారాన్ని బిచ్చమెత్తి (క్రౌడ్‌ ఫండింగ్‌) సేకరిస్తామని పవన్‌ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించుకోవాల్సిందిపోయి వారికి సాష్టాంగపడటం దారుణమని ఆయన తెలిపారు. ప్రజల నుంచి సెస్సు వసూలు చేస్తాం, బిచ్చమెత్తి పరిహారం చెల్లిస్తాం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రతిపాదనను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని ఆయన కోరారు.

Tags:    
Advertisement

Similar News