రామకృష్ణ ఏడుపేమిటో అర్ధంకావటంలేదే?

ఏ విషయంలో అయినా చంద్రబాబుకు మద్దతుగా నిలబడటమే తన ధ్యేయంగా రామకృష్ణ పెట్టుకున్నారు. పవన్ కూడా కలిసొస్తారనేటప్పటికి చాలా సంతోషించారు. అయితే సంతోషించినంత కాలం పట్టలేదు దూరం జరగటానికి. అందుకనే రామకృష్ణ తట్టుకోలేకపోతున్నారు

Advertisement
Update:2022-11-18 12:29 IST

ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది మోర్ లాయల్ దేన్ ది కింగ్ అని. సీపీఐ సెక్రటరీ రామకృష్ణ వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. టీడీపీకి దగ్గరవుతాడని అనుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూరమైపోవటంతో రామకృష్ణ తట్టుకోలేకపోతున్నారు. తమ్ముళ్ళ కన్నా ఈ ఎర్రన్నే చాలా ఎక్కువగా బాధపడిపోతున్నారు. పవన్ విషయంలో ఇప్పటివరకు తమ్ముళ్ళెవరు నోరిప్పకపోయినా సీపీఐ సెక్రటరీ మాత్రం మూడు రోజులుగా పవన్‌ను టార్గెట్ చేస్తునే ఉన్నారు.

ఒకప్పుడు జనసేన అధినేత చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాటాలు చేస్తామని చంద్రబాబు, పవన్ మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యనే నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా మోడీని పవన్ కలిశారు. వాళ్ళ భేటీలో ఏమైందో ఏమో పవన్ టీడీపీకి దూరమైపోయారు. అంతకుముందు ఐక్య పోరాటాలు చేయాలని, కలిసొచ్చే అన్నీ పార్టీలను కలుపుకుని వెళతానని చెప్పిన పవన్ తాజాగా సపరేట్ అనటం ఏమిటంటూ మండిపోతున్నారు.

బీజేపీ, వైసీపీ పెళ్ళి చేసుకోకుండానే కాపురం చేస్తున్నట్లు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడికి పవన్ లొంగిపోయారంటు అక్కసు వెళ్ళగక్కారు. ప్రతిపక్షాల అజెండాను వైసీపీ నిర్ణయించటం ఏమిటంటూ రెచ్చిపోయారు. బీజేపీని రోడ్ మ్యాప్ అడిగిన పవన్ అమాయకుడా లేకపోతే అమాయకత్వాన్ని నటిస్తున్నారా అంటు గోల చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబుకు సీపీఐని రామకృష్ణ తోక పార్టీగా చేసేశారనే విమర్శలు అందరికీ తెలిసిందే.

ఏ విషయంలో అయినా చంద్రబాబుకు మద్దతుగా నిలబడటమే తన ధ్యేయంగా రామకృష్ణ పెట్టుకున్నారు. పవన్ కూడా కలిసొస్తారనేటప్పటికి చాలా సంతోషించారు. అయితే సంతోషించినంత కాలం పట్టలేదు దూరం జరగటానికి. అందుకనే రామకృష్ణ తట్టుకోలేకపోతున్నారు. విచిత్రం ఏమిటంటే సీపీఐకి ఓట్లు లేవు కాబట్టి ఒక్క సీటూ రాదు. ఎవరు ఎవరితో కలిస్తే రామకృష్ణకి ఎందుకు? రాజకీయాల్లో ప్రత్యర్ధులను దెబ్బతీయటానికి ప్రతి పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. పక్కాగా అమలు చేసిన పార్టీకి విజయం దక్కే అవకాశముంది. ఇంతోటిదానికి రామకృష్ణ ఏడుపేమిటో అర్ధంకావటంలేదు.

Tags:    
Advertisement

Similar News