పవన్ పై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ ఒక దళారీ అని, అందుకే టీడీపీ-బీజేపీ మధ్య అనుసంధానం చేస్తున్నారని మండిపడ్డారు సీపీఐ నారాయణ. ఈ మధ్యవర్తిత్వం రాజకీయాల్లో అస్సలు మంచిది కాదన్నారు.
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన ఎవరినైనా తిట్టాలి, లేదా ఆయన్ని ఎవరైనా తిట్టాలి.. ప్రతిరోజూ ఇది నిత్యకృత్యంగా మారింది. ఈరోజు కూడా పవన్ పై ఘాటు విమర్శలే వచ్చాయి. కానీ తిట్టింది మాత్రం వైసీపీ నేతలు కాదు, సీఎం జగన్ అస్సలు కాదు. సీపీఐ నారాయణ, ఊహించని రీతిలో పవన్ పై మండిపడ్డారు. పవన్ ఓ దళారీ అంటూ ధ్వజమెత్తారు.
కారణం ఏంటి..?
పవన్ కల్యాణ్ గతంలో వామపక్షాలతో కలసి పనిచేశారు. ఇప్పటికీ వారి విషయంలో సాఫ్ట్ కార్నర్ తోనే ఉంటారు. కానీ సడన్ గా దళారి పవన్ అంటూ సీపీఐ నారాయణ విరుచుకుపడటం సంచలనంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. పవన్ కల్యాణ్ ఎన్డీఏ మిత్రపక్ష కూటమికి హాజరవుతున్న నేపథ్యంలో సీపీఐ నుంచి ఊహించని రీతిలో ప్రతిస్పందన ఎదురైంది.
పాచిపోయిన లడ్డూలన్నావు కదయ్యా..
గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. హోదా పేరుతో పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారన్నారు. కానీ ఇప్పుడు అదే పవన్ కల్యాణ్ మళ్లీ ఎన్డీఏ కూటమి మీటింగ్ కి ఎందుకు వెళ్తున్నారని మండిపడ్డారు నారాయణ. ఇన్నాళ్లూ జనసేన, బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నా స్పందించని సీపీఐ.. ఇప్పుడు ఎన్డీఏ మీటింగ్ కి పవన్ వెళ్లడంపై ఊహించని రీతిలో ఎదురుదాడికి దిగడం మాత్రం విశేషం.
పవన్ కల్యాణ్ ఒక దళారీ అని, అందుకే టీడీపీ-బీజేపీ మధ్య అనుసంధానం చేస్తున్నారని మండిపడ్డారు సీపీఐ నారాయణ. ఈ మధ్యవర్తిత్వం రాజకీయాల్లో అస్సలు మంచిది కాదన్నారు. జనసేన బీజేపీతో కలవడం, లౌకిక వాదానికి ప్రమాదకరమని అన్నారాయన. నిన్నటి వరకు చేగువేరా దుస్తులు వేసుకుని, ఇప్పడు సావర్కార్ దుస్తులు వేసుకునేందుకు పవన్ సిద్ధమయ్యారని, రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు కూడా ఆయన రెడీ అంటారేమోనని ఎద్దేవా చేశారు నారాయణ. పవన్ కు నిలకడ లేదని, కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే.. ఆ తర్వాత పవన్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చని సెటైర్లు పేల్చారు.