బాంబుల నుంచి గులకరాయికి.. బాబు భజనలో నారాయణ
జగన్ పై జరిగిన దాడికి గులకరాయి దాడి అనే పేరొచ్చిందని, అలా ఏపీ రాజకీయాలు అపహాస్యంపాలయ్యాయని అన్నారు నారాయణ.
చంద్రబాబు బీజేపీతో జతకట్టిన తర్వాత వామపక్షాలు టీడీపీకి దూరం జరుగుతాయని అనుకున్నారంతా. కానీ ఏపీలో బాబు వీరాభిమానులైన వామపక్ష నేతలు మాత్రం ఇంకా ఆయనతోనే అంటకాగుతున్నారు. బాబు భజనలోనే తరిస్తున్నారు. బాబుకి అనుకూలంగా జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జగన్ పై జరిగిన దాడిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బాంబులు వేసుకునే సంస్కృతి నుంచి గులక రాయికి వచ్చారని ఆయన సెటైర్లు పేల్చారు.
జగన్ పై జరిగిన దాడికి గులకరాయి దాడి అనే పేరొచ్చిందని, అలా ఏపీ రాజకీయాలు అపహాస్యంపాలయ్యాయని అన్నారు నారాయణ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళ్లకు కట్టు కట్టుకుని తిరిగారని, ఇక్కడ జగన్ కళ్లకు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు గులకరాయి కథలు అంతా తెలుసన్నారు. అక్కడితో ఆగకుండా పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తూ తన చంద్రబాబు భక్తిని చాటుకున్నారు నారాయణ.
రాయి వేసిన వారిని కాకుండా పోలీసులు ఉద్దేశ పూర్వకంగా మరొకరిని ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు నారాయణ. ఇప్పుడు మరణవార్త అంటే ఎవరూ నమ్మరని చెప్పారు. తెలంగాణాలో తప్పు చేసినా అధికారులు జైళ్లకు వెళ్లారని, త్వరలో ఏపీలో కూడా అలాంటి సీన్ రిపీట్ అవుతుందన్నారు. ఇక్కడ నారాయణ, జగన్ పై సానుభూతి వ్యక్తం చేయకపోయినా పర్లేదు, జగన్ పై సెటైర్లు వేస్తూ చంద్రబాబుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడటమే విచిత్రం. ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలు ఏపీలో మాత్రం బాబుకి భజన చేస్తున్నాయి. ఆ మాటకొస్తే, ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా చంద్రబాబు రాజకీయ లాభం కోసమే పనిచేస్తున్నారు. కేంద్రంలో అధికారం కోసం ఫైట్ చేస్తున్న ఎన్డీఏ, ఇండియా కూటములు.. ఏపీలో మాత్రం జగన్ కి వ్యతిరేకంగా పరస్పర సహకారం అందించుకుంటున్నాయి.