20కంపెనీల కేంద్ర బలగాలు.. ఏపీలో హై అలర్ట్

స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న పోలీసులకు బాడీ కెమెరాలు అమర్చాలని నిర్ణయించారు.

Advertisement
Update:2024-05-29 12:14 IST

పోలింగ్ రోజు ఏపీలో జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కౌంటింగ్ రోజు కోసం ఈసీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఏపీలో జరిగిన ఘటనలు, తదనంతర పరిణామాలకు.. ఇరు వర్గాలు ఈసీని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో కౌంటింగ్ రోజు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా భద్రత మరింత పెంచింది. దాదాపు 20 కంపెనీల బలగాలు కేంద్రం ఏపీకి కేటాయించినట్టు తెలుస్తోంది.

దూరం దూరం..

పోలింగ్ రోజు, ఆ తర్వాత ఘర్షణల్లో పాల్గొన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ. పలువురు నేతల్ని కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకూడదని ఆదేశాలిచ్చింది. గతంలో లాగా కౌంటింగ్ కేంద్రాల వద్ద, పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమికూడే అవకాశమే లేదు. 144 సెక్షన్ తో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. గెలుపు ఎవరిదైనా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేందుకు, వైరి వర్గంపై విరుచుకుపడేందుకు అవకాశం లేకుండా చేస్తామంటున్నారు అధికారులు. సోషల్ మీడియాపై కూడా ఓ కన్నేసి ఉంచామంటున్నారు.

గతంలో మెజార్టీలు బయటపడేకొద్దీ బయట టపాసుల మోత మోగిపోయేది. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి విజయోత్సవ ర్యాలీలు చేస్తారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. విజయోత్సవాలు, సంబరాలపై ఆంక్షలున్నాయి. టపాకాయల తయారీ, అమ్మకాలపై కూడా చాలా ప్రాంతాల్లో నిషేధం ఉంది. కనీసం పెట్రోల్, డీజిల్ కూడా బాటిళ్లలో అమ్మడం లేదంటే పరస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలపై నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.

స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న పోలీసులకు బాడీ కెమెరాలు అమర్చాలని నిర్ణయించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిపై బైండోవర్ కేసులు పెడుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News