టీవీ5 మూర్తి సీఐడీ విచారణ వేళ వివాదం
TV5 Murthy: విచారణ గదిలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని సుప్రీం కోర్టు చెప్పిందని.. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే విచారణకు వస్తామంటూ మూర్తి తరపు న్యాయవాది స్పష్టం చేశారు.
ఏపీ సీఐడీ ముందు హాజరయ్యేందుకు టీవీ5 జర్నలిస్ట్ మూర్తి నిరాకరించారు. విచారణ కోసం ఆయన మంగళగిరి వెళ్లారు. అయితే సీఐడీ కార్యాలయంలో సీసీ కెమెరాలు లేవంటూ ఆయన తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. విచారణ గదిలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని సుప్రీం కోర్టు చెప్పిందని.. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే విచారణకు వస్తామంటూ మూర్తి తరపు న్యాయవాది స్పష్టం చేశారు.
మంగళవారం కూడా తాము అందుబాటులోనే ఉంటామని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగానే పిలిస్తే మూర్తి వస్తారని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై హైకోర్టును ఆశ్రయిస్తామని మూర్తి తరపున న్యాయవాది చెప్పారు. అటు మూర్తికి మద్దతుగా సీఐడీ కార్యాలయం వద్దకు టీడీపీ, జనసేన, వామపక్షాల నాయకులు వచ్చారు.
మూర్తిని టీడీపీ నేత పట్టాభి రిసీవ్ చేసుకున్నారు. చెప్పినట్టు చేస్తే రిటైర్‌మెంట్ తర్వాత మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారని.. అందుకే సీఐడీ సునీల్ కుమార్ రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్‌కు కూడా మీడియా సంస్థలున్నాయని... వాటిలో పనిచేసే జర్నలిస్టులకు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితే రావొచ్చునని కాబట్టి.. ప్రతి ఒక్కరూ మూర్తిపై సీఐడీ చర్యలను ఖండించాలని టీడీపీ నేతలు కోరారు. ఒక జర్నలిస్టును విచారణకు పిలవడమే కాకుండా... సీఐడీ కార్యాలయం వద్ద కిలోమీటర్ వరకు దూరంలో బారిగేట్లు ఏర్పాటు చేశారని.. భారీగా పోలీసులను మోహరించారని ఇక్కడి వాతావరణం చూస్తుంటే మూర్తికి హాని తలపెట్టబోతున్నారన్న అనుమానం కలుగుతోందని పట్టాభి వ్యాఖ్యానించారు.
అటు రఘురామకృష్ణంరాజు ... మూర్తిని విచారణకు పిలవడం వెనుక ఉద్దేశం కోటింగ్ ఇవ్వడం తప్ప మరొకటి లేదన్నారు. సాధారణంగానే సీఐడీ వాళ్లు మనుషులు కాదని.. ఇక సీసీ కెమెరాలు లేకపోతే ఎలా ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. మరి సీఐడీ పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారా?..మూర్తిని ఎప్పుడు విచారిస్తారు అన్నది చూడాలి. రఘురామకృష్ణంరాజుపై అప్పట్లో దేశద్రోహంతో పాటు ఇతర సెక్షన్ల కింద నమోదైన కేసులో మూర్తి కూడా నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల్లోనే విచారణకు పిలిచారు.