వైఎస్ జగన్ చెప్పినా పంతం వీడని అనిల్ కుమార్ యాదవ్.. అదే తీరు!

జగనన్న మాట దేవుడి ఆదేశంగా భావిస్తాను. కానీ.. ఆ వ్యక్తి (రూప్ కుమార్ యాదవ్)తో మాత్రం కలవను. ఒకవేళ మాట తప్పాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని తేల్చి చెప్పేశారు

Advertisement
Update:2023-05-15 10:26 IST

నెల్లూరు జిల్లాలో వైసీపీ బలోపేతానికి సీఎం వైఎస్ జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ జిల్లాకి చెందిన ముగ్గురు సొంత పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారనే ఆరోపణలతో వారిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దాంతో ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్న వైసీపీకి.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారశైలి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం వైఎస్ జగన్ స్వయంగా చెప్పినా అతను ఓ విషయంలో పంతం వీడటం లేదు. దాంతో జిల్లా నేతలు అతనికి మరోసారి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌తో గత కొంతకాలంగా అనిల్ కుమార్ యాదవ్‌కి విభేదాలు ఉన్నాయి. దాంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇటీవల చొరవ తీసుకుని ఇద్దరినీ కలిపారు. జగన్ మాటని కాదనలేక అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు రూప్ కుమార్ యాదవ్‌తో చేయి కలిపినా.. ఆ తర్వాత కథ మళ్లీ మామూలే. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అనిల్ కుమార్‌ యాదవ్‌కి రూప్ కుమార్ యాదవ్ చాలా దగ్గర బంధువు.

రూప్ కుమార్ యాదవ్‌తో మళ్లీ విభేదాలపై అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మాట్లాడుతూ.. జగనన్న మాట దేవుడి ఆదేశంగా భావిస్తాను. కానీ.. ఆ వ్యక్తి (రూప్ కుమార్ యాదవ్)తో మాత్రం కలవను. ఒకవేళ మాట తప్పాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని తేల్చి చెప్పేశారు. ఒకవేళ రాబోవు ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేయలేకపోతే.. ఆ ప్రభావం పార్టీపై పడే అవకాశం ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Tags:    
Advertisement

Similar News